తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో మర ఇద్దరు అరెస్టు అయ్యారు. ఈసారి తండ్రీ కుమారుడిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీళ్లిద్దరు నిందితుల నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అందుకే ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. 


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ పేపర్ లీకేజీ కేసులో నిందితుల జాబితా పెరిగిపోతోంది. విచారణ చేసే కొద్ది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నిందితుల ఇచ్చిన సమాచారం, వారి ఫోన్ డేటా ఆధారంగా కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇద్దర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 


ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన డాక్య ఇచ్చిన సమాచారం మేరకు జనార్దన్, అతని తండ్రి మహిభయ్యాను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కూడా డాక్యకు డబ్బులు ఇచ్చి ఏఈ ఎగ్జామ్ పేపర్ కొన్నట్టు నిర్దారించారు. అందుకే వీళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. 


డాక్యకు జనార్దన్ డబ్బులు ఇచ్చి పేపర్ కొన్నట్టు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. జనార్దన్‌కు ఆయన తండ్రి మహిభయ్యా డబ్బులు సమకూర్చినట్టు తేల్చారు.