హైదరాబాద్ లోని సనత్ నగర్‌లో ఘోరం జరిగింది. ఓ బాలుడిని బలి ఇచ్చారంటూ ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. స్థానికులు ఈ ఆరోపణలతో ఓ హిజ్రా ఇంటిపై దాడికి దిగారు. సనత్ నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఎనిమిది ఏళ్ల బాలుడిని హిజ్రా బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపించారు. బాలుడి శవం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు.
ఎముకలు విరిచి బకెట్‌లో కుక్కి
సనత్ నగర్‌లోని అల్లావుద్దీన్ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. బాలుడి మృతదేహం అదే ఏరియాలోని ఓ నాలాలో కనిపించింది. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ అనే ఎనిమిది ఏళ్ల బాలుడు గురువారం సాయంత్రం నమాజ్ చేయడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఇతను స్థానిక బట్టల వ్యాపారి వసీం ఖాన్ కుమారుడు. బాలుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి.. చివరికి సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహం జింకలవాడ నాలాలో స్థానికులకు కనిపించింది. బాలుడిని హత్య చేసిన నిందితులు ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఒక బకెట్‌లో కుక్కినట్లుగా చూసి స్థానికులు హడలిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని నాలా నుంచి బయటికి తీశారు.
అయితే, వహీద్ ఇంటి పక్కనే ఉండే ఇమ్రాన్ అనే హిజ్రా బాలుడిని మజీదు నుంచి తనతో వెంటబెట్టుకొని వెళ్లినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడిని చంపి ఓ బస్తాలో వేసుకొని ఆటోలో తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా దొరికింది. దీంతో స్థానికులు హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నరబలి ఇచ్చిన్నట్లుగా అనుమానిస్తున్న హిజ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడి మృతికి హిజ్రాయే కారణమా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘటనపై స్పందించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్యకు గురువ్వడం చాలా బాధాకరమని అన్నారు. తాను పోలీసు అధికారులతో మాట్లాడానని, దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
బాలుడిని నర బలి ఇచ్చినట్లుగా బస్తీ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే చిన్న పిల్లాడ్ని హత మార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్టీల వ్యాపారం నిర్వహించే హిజ్రా మహిళ వద్ద బాలుడి తండ్రి, బట్టల వ్యాపారి అయిన వసీం ఖాన్ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య ఘటన జరిగేందుకు ఒక రోజు ముందే వాగ్వాదం జరిగిందని కాలనీ వాసులు చెబుతున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో అల్లాదున్ కోటి బస్తీలో రాత్రి నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.