TSRTC e-Garuda Buses Launch: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు తెలంగాణలో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిని విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు కూడా నడిపించనున్నారు. గరుడ బస్సుల స్థానంలో ఈ - గరుడ పేరుతో ఈ బస్సు సర్వీసులు నడుస్తాయి. హైదరాబాద్-విజయవాడ (Hyderabad to Vijayawada e - Garuda Buses) మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. వాటిలో 10 బస్సులను మంగళవారం (మే 16) నుంచి ప్రారంభించనున్నారు. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. 


మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం (మే 16) సాయంత్రం 4:30 గంటలకు ఈ 10 బస్సుల ప్రారంభం జరగనుంది. ఈ బస్సుల ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ తో కలిసి ఈ - గరుడ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు.


ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలు


ఈ బస్సుల పొడవు 12 మీటర్లు. వీటిలో 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. రీడిండ్‌ ల్యాంప్‌‌ కూడా పెట్టారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు దగ్గర పానిక్‌ బటన్‌ సదుపాయం ఉంచారు. వాటిని టీఎ స్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలు ఉండనున్నాయి. వాటికి ఒక నెలపాటు ఫుటేజీని నిల్వ ఉంచుకొనే బ్యాకప్‌ సామర్థ్యం ఉంది. బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరా కూడా ఉంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులు ఉంటాయి. వీటిలో ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో తెలిపే వివరాలను స్క్రోలింగ్ చేస్తారు. 


అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం (ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ను ఉంది. ఈ బస్సులకు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.


రాబోయే రెండేళ్లలో కొత్తగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్ నగరంలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. హైదరాబాద్‌లో 10 డబుల్ డెక్కర్ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.