TSRTC News: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత టిక్కెట్ల కోసం డిజిటల్ చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేయబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కండక్టర్ కు డబ్బులు చెల్లించకుండా బస్సులోని ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా చెల్లించి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం కసరత్తులు పూర్తి చేసింది. నగదు రహిత టికెట్ కొనుగోలు పద్ధతిని ప్రవేశ పెట్టాలని గతేడాది చివర్లోనే ఆర్టీసీ భావించినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.


ముఖ్యంగా ఏవైనా కారణాల వల్ల డబ్బులు జమ కాకపోతే ఆ డబ్బులకు బాధ్యత ఎవరు వహించాలి, క్యూఆర్ కోడ్ ద్వారా జమ అయిన నగదు ఎవరి ఖాతాలో జమ చేయాలనే అంశా గురించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించిన తర్వాత ప్రయోగాత్మకంగా తొలుతు సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది కనుక సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి. 


మూడ్రోజుల క్రితమే "పల్లెవెలుగు టౌన్ బస్ పాస్" కు శ్రీకారం 


సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు ఆర్ధిక భారం తగ్గించేందుకు కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్‌ పాస్ లతో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలో మీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలో మీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది.






ఇప్పటికే వరంగల్, హైదరాబాద్ లో జనరల్ పాస్ లు 


ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లలో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం "పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌" పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.