Heavy Rains in Telangana: రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి వచ్చే సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం ఉందని వివరించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వీటితోపాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాభాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
ఇప్పటికే సోమవారం రోజు నుంచి ఎడతెరిపి లేకుండా ఇప్పిటికీ వర్షం కురుస్తూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద క్రమంగా వరద పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కు ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి, 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బరాజ్ కు గోదావరితో పాటు ఇంద్రావతి నది వరకు భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి, లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదులుతున్నారు. వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. బొగత జలపాతం వద్దకు పర్యాకుల సందర్శనను అటవీశాఖ అధికారులు నిలిపివేశారు.
జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్
మరోవైపు రాష్ట్రంలో భారీ నుంతి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో అస్సలే బయటకు వెళ్లకూడదని అంటున్నారు. ఈక్రమంలోనే సీఎం శాంతి కుమారి మంగళవారం రోజు కలెక్ర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితిని అయినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల వద్ద ఉన్న వారికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి రాహుల్ ప్రతీక్షణం అందుబాటులో ఉండాలని సీస్ శాంతి కుమారి వివరించారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉంది. ఈరోజు అంతా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 10 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 95 శాతంగా నమోదైంది.