Andhra Politics :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసే ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఖచ్చితంగా టీడీపీ కలసి వస్తుందని అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్డీఏ మీటింగ్ కు వెళ్లలేదు. తాము ఎన్డీఏలో కలుస్తామన్న సంకేతాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆహ్వానం  వచ్చేది. కానీ బీజేపీ హైకమాండ్ ఏపీ విషయంలో చాలా గందరగోళంగా ఉంది. వైఎస్ఆర్‌సీపీతో ఉన్న  రహస్య సంబంధాలను తెంచుకునేందుకు ఏ మాత్రం ఆసక్తిగా లేదు.  కానీ అలాంటి లోపాయికారీ ఒప్పందాలు ఉంటే.. బీజేపీతో కలిస్తే అర్థం ఉండదని టీడీపీ తేల్చేసింది. దీంతో ఏపీలో కూటమి అనేది సస్పెన్స్ లో పడింది. 


కూటమిలో బీజేపీ ఖచ్చితంగా ఉండాలంటున్న పవన్ 


ఏపీలో వైసీపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న  పవన్ కల్యాణ్ ఓట్లు చీలిపోకూడదని డిసైడవుతున్నారు. ఓట్లు చీలిపోతే.. రాజకీయం మారిపోతుందని ఆయన అనుకుంటున్నారు. అంత వరకూ  బాగానే ఉంది కానీ.. ఖచ్చితంగా బీజేపీని కలుపుకోవాలని అనుకుంటున్నారు. బీజేపీకి ఏపీలో ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఒక వేళ పొత్తులు పెట్టుకున్నా..ఉన్న ఆ కొద్ది ఓటు  బ్యాంక్ కూటమి పార్టీలకు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. అయితే కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా బీజేపీ కలిసి రావాలని పవన్ కోరుకుంటున్నారు. కానీ జాతీయ రాజకీయాల కోణంలో బీజేపీ ఏ పార్టీతోనూ ఇప్పుడు కలిసే అవకాశం లేదు. ఏ పార్టీతో కలిసినా మరో పార్టీ దూరమవుతుందన్న కారణంగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. 


వైసీపీ అవినీతిపై చర్యలు తీసుకుంటేనే అంటున్న టీడీపీ !


ఏపీలో నాలుగేళ్లలో జరిగిన పాలనలో జరిగిన అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేయించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో దర్యాప్తు సంస్థలు దూకుడు చూపుతున్నాయి. అదే తరహాలో ఏపీలోనూ అవినీతిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. నిజానికి ఏపీలో ఒక్క లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేయిస్తేనే వేల కోట్ల అవినీతి బయటపడుతుందని ఇదంతా ప్రభుత్వ పెద్దల ఖాతాల్లోకి వెళ్లిందని టీడీపీ అంటోంది. అదే సమయంలో వివేకా హత్య కేసులో నిందితుల్ని కూడా కాపాడుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటిపై బీజేపీ ఏదో ఓ చర్య తీసుకోకపోతే టీడీపీ .. బీజేపీతో జత కట్టడానికి సిద్ధమయ్యే అవకాశం లేదు.


బీజేపీతో కలిసేందుకు టీడీపీ సిద్ధపడకపోతే పవన్ ఏం చేస్తారు ?


వైసీపీతో సంబంధాలను కొనసాగించాలని బీజేపీ అనుకుంటే.. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోదు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తారన్నది కీలకం. పవన్ కల్యాణ్ ప్రస్తుత టార్గెట్ వైసీపీని ఓడించడం. వైసీపీకి తెర వెనుక బీజేపీ సహకారం ఇస్తుందని ఆయన కూడా అనుకోకుండా ఉండరు. తాము పొత్తులో ఉండి కూడా.. తాము ఓడించాలనుకున్న పార్టీకి  బీజేపీ అండగా ఉంటుందంటే పవన్ కల్యాణ్ కూడా అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే బీజేపకి పవన్ కల్యాణ్ కూడా గుడ్ బై చెబుతారని అంటున్నారు. అప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ పవన్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. అందుకే ముందు ముందు ఆయనేం చేస్తారన్నది సస్పెన్స్ గానే ఉంటోంది.