TSRTC Special Offer: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రథ సప్తమిని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ ఆలాయలకు ప్రత్యేక బస్సులు నడపబోతోంది. మొత్తంగా 80 బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ ఆలయాలైన వేములవాడు, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెంకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. కరీంనగర్ నుంచి వేములవాడకు వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్గొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబూబ్ నగర్ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్ నుంచి గూడెంనకు 5, హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 


హైదరాబాద్ లోని జూబ్లీహల్స్ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్ నగర్ బాలాజీ, తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపబోతోంది. రథ సప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, భక్తులు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, సంస్థ ఎండీవీసీ సజ్జనార్ లు పేర్కొన్నారు. భక్తుల రద్దీ మేరకు అవసరం అయితే మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రథ సప్తమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే వసంత పంచమని సందర్భంగా కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. భక్తుల కోసం 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88, సిద్దిపేట జిల్లాలోని వర్గల్ కు 20 బస్సులను బుధ, గురు వారాల్లో తిప్పింది. 






సంక్రాంతి కూడా స్పెషల్ బస్సులు - భారీ ఆదాయం


సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. సాధారణ చార్జీల తోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌ లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ. 165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ. 62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. కిలో మీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలో మీటర్ల మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలో మీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలో మీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్‌) 59.17 గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19 కి పెరిగింది.