Sambhaji Raje Meet CM KCR : మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న  శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చంతో సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారు.  మధ్యాహ్నం భోజనంతో వారికి ఆతిథ్యం ఇచ్చారు.  అనంతరం సీఎం కేసీఆర్, శంభాజీ రాజె సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రజా సంక్షేమం,  అభివృద్ధి  గురించి శంభాజీ రాజె ఆరా తీశారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా  అన్ని వర్గాల ప్రజలకు ఇంత గొప్పగా సంక్షేమాన్ని అందిచడంలో తెలంగాణ  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవడానికి ఛత్రపతి శంభాజీ రాజె ఆసక్తి చూపారు.  అందుకు సంబంధించిన అంశాలను సీఎం కేసీఆర్ ను సవివరంగా అడిగి తెలుసుకున్నారు.



దేశంలో రాజకీయ పరిస్థితులపై చర్చ 


తెలంగాణ మోడల్  అభివృద్ధి సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా  అమలు చేస్తే బాగుంటుందని ఛత్రపతి శంభాజీ రాజె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రగతి నమూనా ఇక్కడికే పరిమితం కాకుండా మహారాష్ట్ర సహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు  దేశ వ్యాప్తంగా విస్తరించాల్సి ఉందని రాజె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలతో పాటు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. దేశ ప్రజల అభ్యున్నతి కోసం, దేశ సమగ్రత కోసం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా  వినూత్న ఎజెండా ప్రజల ముందుకు రావాల్సిన  అవసరం ఉందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. అవసరమైతే సందర్భాన్ని బట్టి మళ్లీ ఒకసారి కలుసుకుని అన్ని అంశాలపై చర్చిద్దామని నిర్ణయించారు. ఛత్రపతి శంభాజీ రాజ్ పూర్వీకులు శివాజీ మహారాజ్  నుంచి సాహూ మహారాజ్ దాకా ఈ దేశానికి వారందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందంచిన పాలన దేశ చరిత్రలో నిలిచిపోతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వారి స్ఫూర్తితోనే, కుల మత వివక్షకు తావు లేకుండా  తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కు ఛత్రపతి శంభాజీ రాజె అందించారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటు ఛత్రపతి శంభాజీ రాజే తో పాటు వచ్చిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


 నాందేడ్ లో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ బహిరంగ సభ 


 మరో వైపు  మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు సభకు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత బాలమల్లును ఇన్‌చార్జిలుగా నియమించారు. కేసీఆర్‌ మూడు రోజులుగా ఈ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేసేందుకు, ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు. మంగళవారం జోగు రామన్న నేతృత్వంలో బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి తదితర నేతలు నాందేడ్‌ జిల్లాలో పర్యటించి సభను నిర్వహించే స్థలాన్ని అక్కడి నాయకులతో కలిసి పరిశీలించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారి మహారాష్ట్రలో బహిరంగసభ నిర్వహిస్తుండడంతో కేసీఆర్‌ మం త్రులతో పాటు నాందేడ్‌జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు.