ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఒకవేళ ఎవరూ హాజరుకాకపోతే కనుక ఎక్స్‌పార్టీగా పేర్కొంటామని చెప్పింది. సహకార పరపతి సంఘానికి (సీసీఎస్) నిధుల చెల్లింపు విషయంలో తాము గతంలోనే ఆదేశాలు ఇచ్చినా ఎందుకు చెల్లింపులు చేయలేదో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
సహకార పరపతి సంఘానికి జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుందని ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. దీంతో వడ్డీతో పాటుగా దాదాపు రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన లోన్లు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా సంస్థ నుంచి స్పందన రావడం లేదని బాధితులు కోర్టుకు వెళ్లారు. హైకోర్టును ఆశ్రయించిన వారికి కోర్టు ఊరట కలిగించింది. మే 15వ తేదీలోగా రూ.50 కోట్లు ఇవ్వాలని, మరో రూ.100 కోట్లను నవంబర్ 25లోగా సహకార పరపతి సంఘంలో జమ చేయాలని ఏప్రిల్‌లో హైకోర్టు తెలంగాణ ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చింది.
అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఆర్టీసీ యాజమాన్యం గడువు లోపు నిధులు చెల్లించలేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కావాలనే ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు జూన్‌లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్‌ను చేర్చారు. ఈ పిటిషన్ జస్టిస్ పి. మాధవీ దేవి ధర్మాసనం వద్దకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్ రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తాజా ఆదేశాలు ఇచ్చింది. ఎండీ, చీఫ్ మేనేజర్ అయిన సజ్జనార్ హాజరుకావాలని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.