తెలంగాణలో శనివారం(జులై 1) నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8,180 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.


పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేశారు. దీంతో చాలా మంది అభ్యర్థు ఆఖరి నిమిషంలో వచ్చి లోపలికి అనుమంతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మరికొందరు సెంటర్‌ వద్ద బోరున విలపించారు. ఓ అభ్యర్థి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ సెంటర్‌కు గూగుల్ మ్యాప్‌ ద్వారా వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ స్కూల్ ఉండే పాత అడ్రెస్‌ చూపించింది. అక్కడకు వెళ్లి విషయం తెలుసుకొని కొత్త స్కూల్ అడ్రెస్‌కు వెళ్లేసరికి టైం అయిపోయిందని అధికారులు చెప్పి అనుమతి ఇవ్వలేదు. 


సెల్ ఫోన్‌‌తో పరీక్షకు హాజరు.. 
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  శనివారం నిర్వహించిన  'గ్రూప్-4' ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్ తో హాజరైనట్లు ఇన్విజిలేటర్ గమనించారు.  అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరీష్  ప్రకటించారు.  సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. 


పొరపాటున తీసుకెళ్లారా.? కాపీ కోసమా అన్నది తేల్చనున్న అధికారులు                                   
టీఎస్‌పీఎస్‌ఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల్లో పేపర్ల లీకేజీ జరగడంతో ఇటవల ఏ చిన్న అంశం జరిగినా సంచలనం అవుతోంది.  అత్యాధునిక టెక్నాలజీని అందిప్చుచుకుని హైటెక్ పద్దతిలో కాపీయింగ్ చేస్తున్న వారిని ఇటీవల పట్టుకుంటున్నారు. అందుకే ఏ చిన్న ఎలక్ట్రానిక్ పరికారన్ని కూడా అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించడం లేదు. అలా తీసుకెళ్లినట్లుగా గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా సెల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థి తెలియక తీసుకెళ్లారా లేకపోతే.. ఉద్దేశపూర్వకంగా తసుకెళ్లారా అన్నది తేలాల్సి ఉంది. 


గ్రూప్‌-4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న..
గ్రూప్-4 పరీక్షలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ఆర్థిక స్థితిగతులపై పలు ప్రశ్నలొచ్చాయి. మొదటి సెషన్‌లో జరిగిన పరీక్షలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. బలగం సినిమాపై ఓ ప్రశ్న వచ్చింది. జతపరచమని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. గతంలో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా బలగంపై ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే.


ప్రశ్న ఇదే:- బలగం చిత్రానికి సంబంధించి సరైన జవాబుతో జతపరచండి. అని ప్రశ్న ఇచ్చారు.


A. దర్శకుడు: వేణు యెల్హండి 


B. నిర్మాత: దిల్‌ రాజు/ హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి  


C. సంగీత దర్శకుడు: భీమ్స్‌ సిసిరోలియో 


D. కొమరయ్య పాత్రను పోషించినవారు: అరుసం మధుసూధన్ అని ఇచ్చి కింద ఆప్షన్లు ఇచ్చారు. 
దీనికి సరైన జవాబు ఏ, బీ, సీ



కాగా, బలగం సినిమాపై గ్రూప్‌-4లో ప్రశ్న అడగడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. డైరెక్టర్‌ యెల్దండి వేణు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశాడు.