తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నాయకత్వంలో వ్యవస్థ పని తీరు ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ పాలనలో తన మార్కును చూసిస్తూ వస్తున్నారు. నేరుగా సిటీ బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల మధ్య కూర్చొని ప్రయాణించి ప్రజల్లో ఆర్టీసీ బస్సుల పట్ల ఇష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ప్రయాణికులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాల్లో ట్వీట్లు చేసిన వెంటనే స్పందించారు. ఆ సమస్యల పరిష్కారాలకు పని చేశారు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి అర్ధరాత్రి వేళ చేసిన ట్వీట్‌కు సజ్జనార్ స్పందించి తగిన చర్యలకు ఆదేశించారు.
అర్ధరాత్రి ఓ యువతి చేసిన ట్వీట్‌పై వెంటనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అర్ధరాత్రి సమయాల్లో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం బస్సులను పెట్రోల్ బంకుల వద్ద ఓ 10 నిమిషాలు ఆపాలని కోరారు. యువతి పాలే నిషా ఈ మేరకు ట్వీట్ చేశారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలకు వాష్ రూంకు వెళ్లాల్సి వస్తుందని, అది చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి చెప్పారు.
‘‘మహిళలు రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆర్టీసీ యాజమాన్యం.. స్త్రీల అవసరాల నిమిత్తం పెట్రోల్ బంకుల్లో ఒక పది నిమిషాలు ఆపితే మహిళలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది (అవసరాలు బయటికి చెప్పలేరు కాబట్టి) ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్‌కి కూడా ఎటువంటి భారం ఉండదు.’’ అని ట్వీట్ చేశారు.
వెంటనే ఆ యువతి చేసిన అభ్యర్థనకు వెంటనే ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ విషయంపై అధికారులకు సూచించినట్లు రీ ట్వీట్ చేశారు సజ్జనార్. అర్ధరాత్రి సైతం మహిళ సమస్యపై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ నిషా ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా, సజ్జనార్ నిబద్ధత పట్ల నెటిజన్లు సైతం ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతికి ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు ఎలాంటి అనదపు టికెట్ ఛార్జీలు వసూలు చేయకుండా సజ్జనార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్ టెర్రర్.. అమెరికాలో ఒక్కరోజులో 11 లక్షల కేసులు