Telangana State Public Service Commission : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ (Chairman)పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Cs) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం అయ్యే అవకాశం ఉంది. ఛైర్మన్‌ పదవి కోసం మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించింది. అయితే తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డికే ఎక్కవ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించే వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ నేథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, త్వరలో రిటైర్ అవనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో...ఆయననే ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామక ఫైలును...  గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది.


గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షల నిర్వహణలో బోర్డు విమర్శల పాలయింది. పరీక్షపేపర్ లీకులో బోర్డులో పని చేసే ఉద్యోగులే ఉండటం రాజకీయ దుమారం రేపింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్‌, 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్‌ పదవితో పాటు 8 మంది సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఛైర్మన్‌తో పాటు తొమ్మిది మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. బోర్డులో కీలకమైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పోస్టు కూడా ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణ ఐఏఎస్ ను ఈ పోస్టులో నియమించాల్సి ఉంటుంది. గతంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ గా పని చేసిన ఐఏఎస్‌ అధికారి సంతోష్‌...జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.


కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాత పోటీ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ అనుసరిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరుగైన విధానాలను కమిటీ అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరును పరిశీలించనుంది. తర్వాత అధ్యయన నివేదిక సభ్యులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. కమిషన్‌లో పలు మార్పులు జరిగే అవకాశంద ఉంది. యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు సలహాలను కోరారు. కొత్త బోర్డు నియమించిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. గ్రూప్‌-2 పరీక్షలతో  ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూలు ప్రకటించనుంది.