Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (Vigilance And Enforcement ) విచారణలో...సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్‌ (Medigadda Barrage) నిర్మాణం...దేశంలోనే భారీ స్కాం (Scam) జరిగినట్లు గుర్తించింది. 3వేల కోట్లకుపైగా ప్రజాధానం వృథా అయినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికలో వెల్లడించింది. 3వేల 200కోట్ల ప్రజాధనాన్ని బ్యారేజ్‌ నిర్మాణం పేరుతో వృథా చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలింది. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో అక్రమాలపై మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించేందుకు రెడీ అవుతోంది. ప్రజాధనం పేరుతో మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మించి...ఆటలు ఆడుకున్నారని విజిలెన్స్‌ నివేదికలో పొందుపర్చింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులేనని...ఎన్ని పిల్లర్లు ఎంత బలంగా ఉన్నాయన్నది తేల్చాల్సి ఉందని అభిప్రాయపడింది.


11 పిల్లర్లు బాగా దెబ్బతిన్నట్లు తేల్చిన విజిలెన్స్‌ 
మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బ్యారేజ్‌లో ప్రస్తుతం ఉన్నపియర్స్‌లో...11 పియర్స్‌ బాగా దెబ్బతిన్నట్లు విజిలెన్స్‌ తేల్చింది. దెబ్బతిన్న పియర్స్‌ మరమ్మతులు చేసినంత మాత్రాన...బ్యారేజీకి ఎలాంటి గ్యారెంటీ లేదని స్పష్టం చేసింది. లొకేషన్‌ నుంచి మొదలుకుని డిజైన్, నిర్మాణం, నాణ్యత నిర్వహణ వరకు అంతా గందరగోళంగా ఉందని విజిలెన్స్‌ తేల్చింది. పియర్స్‌కు ఉన్న సిమెంట్‌...తక్కువ కాలంలోనే సిమెంట్‌ పోయిందని విజిలెన్స్‌ తేల్చింది. గడ్డర్ల వద్ద పగుళ్లు, ఉపయోగించిన స్టీల్స్‌ చూస్తే  నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. 


మేడిగడ్డ బ్యారేజ్‌ మొత్తం ప్రమాదంలోనే
 ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం బ్యారేజ్‌ ప్రమాదంలో ఉందని అనుమానం వ్యక్తం చేసింది. బ్యారేజీ కింది భాగంలో 10 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్‌ వంద మీటర్లు దూరం కొట్టుకుపోయాయన్న విజిలెన్స్‌...బ్యారేజ్‌ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని, రెండు మూడేళ్ల క్రితం నుంచే సమస్య ఉన్నట్లు వెల్లడించింది. వరద ప్రవాహానికి తగ్గట్లు డిజైన్ లేదని, సెంట్రల్ వాటర్ కమిషన్‌ నుంచి నివేదిక తెప్పించుకోలేదని విజిలెన్స్‌ తెలిపింది. వరద ఉదృతి అంచనా వేయకుండానే డిజైన్‌ చేశారని నివేదికలో పొందు పరిచింది. 


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని.. దానికి నిదర్శనమే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది  రేవంత్ సర్కార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్ మెంట్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి బ్యారేజ్ ను పరిశీలించింది. ఏడో బ్లాక్‌లోనే కాకుండా అటూ ఇటూ ఉండే 6,8 బ్లాక్‌లలో కూడా మరిన్ని పియర్స్‌కు నష్టం వాటిల్లినచ్లు అంచనాలు వేస్తున్నాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్‌ వంద మీటర్లు దాటి కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  డిజైన్‌లో కూడా లోపాలు ఉన్నట్లు భావిస్తున్న అధికారులు, లాగ్‌బుక్‌, కాంక్రీటు మిక్సింగ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు కూడా అన్నీ లేవని సంబంధిత ఇంజినీర్లు చెప్పినట్లు తెలిసింది. డ్యామేజ్ అయిన మేడిగడ్డ బ్యారేజ్ పై సంచలన రిపోర్ట్ సిద్ధం చేసింది.