Barrelakka Will Contest Loksabha Elections : సోషల్‌ మీడియా ప్రభావంతో స్టార్‌గా మార రాజకీయ అరంగేట్రం చేసిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష మరోసారి వార్తల్లోకి వచ్చారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో పెరిగిపోయిందంటూ టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ సెలబ్రిటీగా మారిన శిరీష మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండింట్‌ అభ్యర్థిగా కొల్లాపూర్‌ స్థానం నుంచి పోటీ చేశారు. నామినేషన్‌ దాఖలు చేసిన దగ్గర నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సామాజిక మాధ్యమాల్లో ఆమె వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ఆమెకు అండగా ఉండేందుకు అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివెళ్లారు. ఏపీ నుంచి మాజీ సీబీఐ అధికారి వీవీ లక్ష్మినారాయణ కూడా వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికలు ముగిశాయి. సుమారు ఆరు వేల ఓట్లు సాధించారు శిరీష. ఆ ఎన్నికల్లో దక్కిన ఓటమితో ఏమాత్రం కుంగిపోని శిరీష మరోసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటకే ఎన్నికల కమిషన్‌ జోరుగా ఏర్పాటు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని బర్రెలక్క నిర్ణయించినట్టు చెబుతున్నారు. 


నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి


గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఈసారి నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ స్థాన నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయించిన ఆమె అందుకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళతానని ఆమె చెబుతున్నారు. గత ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున హైప్‌ సంపాదించుకున్న బర్రెలక్క ఓటమి చవి చూశారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లో దక్కిన ఓటమితో ఏమాత్రం కుంగిపోకుండా మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న బర్రెలక్కను పలువురు అభినందిస్తున్నారు. ఈసారి ఎటువంటి పలితాలు ఎదురవుతాయో చూడాల్సి ఉంది. 


మళ్లీ అండగా ఉంటారా..?


అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బర్రెలక్కకు అండగా అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఆర్థికంగానూ ఎంతో మంది సహాయాన్ని అందించారు. నామినేషన్‌ దాఖలు చేసిన దగ్గర నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆమెతోనే ఎంతో మంది ఉన్నారు. ప్రచారాన్ని హోరెత్తించారు. సామాజిక మాధ్యమాలు కూడా ఆమెకు ఎనలేన హైప్‌ను క్రియేట్‌ చేశాయి. అనూహ్య రీతిలో బర్రెలక్క ఓటమిని చవి చూసింది. ఒక్క ఓటమి అనేక ప్రశ్నలకు సమాధానాలను చూపించాల్సి ఉంటుంది. ఓటమి అనేక అవమానాలకు కారణం అవుతుంది. బర్రెలక్కకు అటువంటి పరిస్థితే ఓటమి తరువాత ఎదురై ఉంటుంది. కానీ, ఏమాత్రం వెరవక మరోసారి బరిలోకి దిగేందుకు శిరీష సన్నద్ధమవుతున్నారు. గతంలో మాదిరిగానే పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న బర్రెలక్కకు అండగా ఉండేందుకు వస్తారా..? ఓటమి కలిగించిన భయంతో ఆమెకు దూరంగా ఉండిపోతారా..? అన్నది చూడాల్సి ఉంది. ఎవరు వచ్చినా..? రాకపోయినా..? తన పోరాటం మాత్ర సాగుతుందని శిరీష తన సన్నిహితులు వద్ద చెబుతోంది.