గ్రూప్‌ 2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల డిమాండ్‌లను పరిశీలిస్తామని తెలిపారు. 


వరుసగా వస్తున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్  అయ్యే టైం లేదని డిమాండ్ చేస్తూ గ్రూప్ 2 అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆగస్టు 29, 30న జరిగే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. 


టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ ముట్టడికి యత్నించిన అభ్యర్థులతో నాంపల్లి పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా వచ్చిన అభ్యర్థులు వారికి మద్దతు పలికిన రాజకీయా పార్టీల అనుచరులతో ఆప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ రూట్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. 


దీంతో కొందరు అభ్యర్థులను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. రాజకీయ పార్టీల నాయకులను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితి మరింత హాట్‌గా మారడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పందించాల్సి వచ్చింది. 


కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న అభ్యర్థులకు నాయకత్వం వహిస్తున్న కొందరు నాయకులను పిలిచి మాట్లాడారు. వారితో చర్చించి పరిస్థితి వివరించారు. వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపేశారు. 


విద్యార్థులతో మాట్లాడిన అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వినతిపత్రం తీసుకున్నామని అందులో తెలిపారు. వారి విన్నపాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని వివరించారు. 
ప్రస్తుతానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేశారు అనిత రామచంద్రన్. దీనిపై టీఎస్‌పీఎస్‌సీ స్పష్టమైన ప్రకటన చేస్తుందని అంత వరకు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు సూచించారు.