తెలంగాణ ధాన్యం కొనుగోలు వివాదం కొనసాగుతూనే ఉంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనడం ప్రారంభించినా ప్రభుత్వంపై విమర్శలు ఇంకా పోవడం లేదు. ధాన్యం విషయంలో ఇన్ని రోజులు ప్రభుత్వం నాన్చుతూ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరో ఒకరు కొని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చిందన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. తమ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనేందుకు ముందుకొచ్చిందన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం కారణంగా ఇప్పటికే చాలా మంది రైతులు పండి పంటను అమ్ముకున్నారన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం కొనకపోతే మొత్తానికి నష్టపోతామని భయపడి తక్కువ ధరకే దళారులకు అమ్ముకున్నారని ఆరోపించారు. వాళ్లకు నష్టపరిహారంగా ఎకరానికి ఆరువందలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 


యాసంగి ప్రారంభంలో రైతులను భయపెట్టిన కేసీఆర్‌... వరి వేయొద్దన్నారన్నారు రేవంత్ రెడ్డి. ఈ కారణంగానే చాలా మంది రైతులు వరి వేయకుండా నష్టపోయారని.. వాళ్లకి కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట వేయక నష్టపోయిన రైతులకు ఎకరానికి 15వేల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. 


ఈ రెండు డిమాండ్‌లతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని రేవంత్‌  ప్రకటించారు. నేషనల్ క్రైమ్‌ బ్యూరో రిపోర్ట్‌ ప్రకారం తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. కానీ ప్రభుత్వం 82 వేల మందికి పరిహారం ఇచ్చినట్టు ప్రకటనలు చేస్తుందని ఏది కరెక్టో చెప్పాలని డిమాండ్ చేశారు. 


వివిధ రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరిన్ని పోరాటాలపై ఉద్యమానికి సిద్దమైందన్నారు రేవంత్. అందులో భాగంగా తెలంగాణలో రైతు సంఘర్షణ పేరుతో సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. వరంగల్‌లో 6,7 తేదీల్లో ఈ సభ ఉంటుందన్నారు. దీనికి రాహుల్ గాంధీ రాబోతున్నట్టు తెలిపారు రేవంత్. 


మిల్లర్లు, ప్రభుత్వం కలిసి 3 వేల కోట్ల కుంభకోణం చేశాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎఫ్సిఐకి చెందిన బియ్యం మాయమయ్యాయన్నారు. కేసిఆర్ అధికార ఉన్మాదిగా మారి దోచుకుంటున్నారన్నారు. బియ్యం మాయమైన ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. 


కేసిఆర్ అవినీతిని ఎండ గట్టడానికే రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు రేవంత్. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయన్న రేవంత్‌ రెడ్డి... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు జోలికి వచ్చిన వారిని ఎవర్నీ వదిలి పెట్టబోమన్నారు రేవంత్. ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ కాస్త పద్దతిగా ఉండాలని హెచ్చరించారు. ఆయన అరాచకాలు పెట్రేగిపోతున్నాయని... ఇంట్లో దూరి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారపు.