Sameer Hospital Fentanyl Injections Case: డ్రగ్స్ ఇంజెక్షన్లు (Drug Injections) విక్రయిస్తున్న కేసులో సమీర్ ఆస్పత్రి (Sameer Hospital)పై నార్కోటిక్, డ్రగ్స్ కంట్రోల్ (Telangana State Anti Narcotics Bureau) అధికారులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు (Rajendra Nagar Police) దాడులు చేశారు. సమీర్ ఆస్పత్రి చైర్మన్ షోయబ్ సుభానీ (Shoaib Subhani), డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్, ఫార్మాసిస్ట్ నసీరుద్దీన్, ఎగ్జిక్యూటివ్ ఫార్మాసిస్ట్ మహ్మద్ జాఫర్, మెడికేర్ ఫార్మా డిస్టిబ్యూటర్ మ్యానేజింగ్ పార్టనర్ గోపు శ్రీనివాస్‌ను రాజేంద్రనగర్, ఎస్‌ఓటీ, టీఎస్ నాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో వైద్యుడు ఆషాన్ ముస్తఫా ఖాన్ పరారీలో ఉన్నాడు.
పోలీసుల దాడులు
పోలీసుల వివరాల మేరకు.. డ్రగ్స్‌కు బానిసగా మారిన వ్యక్తికి వైద్యల దంపతులు డ్రగ్స్ ఇంజక్షన్లు ఫెంటనేయిల్ సిట్రస్ విక్రయిస్తున్నట్లు తెలిసింది. వెంటనే రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, టీఎస్‌నాబ్ పోలీసులు ఫెంటనేయిల్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న వైద్యుడి ఇంటిపై దాడి చేశారు. మత్తు వైద్యులుగా సమీర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఆషాన్ ముస్తాఫా, అతడి భార్య లుబ్‌నా నజీబ్ ఖాన్‌ను అరెస్టు చేశారు.
విచారణలో అసలు విషయాలు
విచారణలో అసలు విషయాలు బయటికి వచ్చాయి. దీంతో పోలీసులు ఆస్పత్రిపై దాడి చేసి ఆస్పత్రి చైర్మన్ సోయబ్ సుభాని, డైరెక్టర్ ఎండీ అబ్దుల్ ముజీబ్, ఫార్మసిస్ట్ సయిద్ నసీరుద్దిన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎండీ జాఫర్, డిస్ట్రిబ్యూటర్ గోపు శ్రీనివాస్ కలిసి ఫెంనేయిల్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురు కుమ్ముకై డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
అనుమతులు లేకుండా విక్రయం
ఫెంటనేయిల్ ఇంజక్షన్లు విక్రయించేందుకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతులు తీసుకోవాలి, అయితే సమీర్ ఆస్పత్రి నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో అందరూ కలిసి ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.57కు కొనుగోలు చేసి ఏకంగా రూ.5 వేల నుంచి రూ.6 వేలకు విక్రయించేవారు.
నకిలీ రసీదులు
ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయించుకుంటూ ఆసుపత్రిలో రోగులకు ఇంజెక్షన్ వాడినట్లు నకిలీ ప్రిస్క్రిప్షన్లు సృష్టించారు. ఆస్పత్రి రికార్డ్స్‌ను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఒక్క రోగికి ఇంజక్షన్ ఇవ్వలేదని నిర్ధారించారు. అలాగే నకిలీ ప్రిస్క్రిప్షన్లను ఉపయోగించి నిందితులు 100 ఇంజక్షన్లను కోనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటిలో 43 ఇంజక్షన్లను డ్రగ్స్ వాడుతున్న వారికి విక్రయించగా, 57 ఇంజక్షన్లను మత్తు వైద్యుడి భార్య వద్ద నుంచి రికవరీ చేశారు. నిందితులను రాజేంద్రగనర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.