KTR Meeting With BRS Leaders: అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నాలుగు లక్షల ఓట్లతో అధికారానికి దూరం అయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందని అన్నారు.
బీఆర్ఎస్ మరో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదని అన్నారు. అతి తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామని వివరించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో ఓడిపోయామని, ఈ సారి అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరాలని అన్నారు. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరిలో ఈ సారి తెలుపు బీఆర్ఎస్‌దే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి, నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కరెంట్ బిల్లులు కట్టొద్దన్నందుకు బట్టి విక్రమార్క తనను విధ్వంసకర మనస్తత్వం అని అంటున్నారని, నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా అంటు ప్రశ్నించారు. సోనియా గాంధీ బిల్లులు కడుతుందని వాళ్లు చెప్పారని, కరెంటు బిల్లులు సోనియాకే పంపుదామని అన్నారు. కరెంట్ బిల్లులను సోనియాకు పంపేలా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాయాత్తం చేయాలని సూచించారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పనిచేయాలని సూచించారు. నిరుద్యోగ భృతిపై భట్టి విక్రమార్క ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారని, అలాగే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందని విమర్శించారు. హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే ఎండగట్టేలా పనిచేయాలని సూచించారు. సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్ధంగా వాడుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టలేకపోయామని కేటీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో విలాసవంతమైన సౌకర్యాలు అంటూ దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారని, అక్కడ విలాసాలే ఉంటే భట్టి ఈ పాటికే ఠాం ఠాం చేయక పోయేవారా అంటూ ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో రేషన్ కార్డులు ఇచ్చామని కానీ ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీ పూర్తి స్థాయిలో వేయక పోవడంతో నష్టం జరిగిందని, ఇక ముందు అలా జరగదని హామీ ఇచ్చారు.
మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామని కేటీఆర్ పార్టీ శ్రేణులకు చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవు. కార్ కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని, మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకెళ్తుందన్నారు. కాంగ్రెస్ తప్పుడు కేసులు పెడుతోందని, కార్యకర్తలు అధైర్య పడొద్దని సూచించారు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని, మోదీకి రేవంత్ రెడ్డికి భయ పడే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆర్ ఎస్‌దే అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు.
కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇటీవల మోదీని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసినపుడు ఆయన బీఆర్‌ఎస్‌ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ టీం కాదని, బీజేపీ కాంగ్రెస్‌లు ఒక్కటేనని అన్నారు. అదానీ, మోదీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్, దావోస్‌లో అదే అదానీతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.