Telangana Govt appoints Three Advisors: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియమితులు అయ్యారు. ప్రభుత్వ సలహాదారుగా (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వెల్ఫేర్) షబ్బీర్ అలీ, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారుగా (ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్) హెచ్. వేణుగోపాల్ రావు నియమకం అయ్యారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నలుగురికి కేబినెట్‌ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 


కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దాదాపుగా కసరత్తు దాదాపు పూర్తిచేసింది. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం మహేశ్‌ కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. వారు నామినేషన్లు కూడా వేశారు. ముగ్గురు ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నియామకంతో తాజాగా కీలక నేతలకు అవకాశం కల్పించినట్లు అయింది. ఆర్టీసీ ఛైర్మన్‌ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కీలక నేతలను ఎంపిక చేసినట్లుగా సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్, లండన్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చాక ఆ పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.