Flaxseed Laddu Recipe : ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఇది బుక్​లలోనూ.. పలు సభల్లో వినడమే తప్పా రియాలటీలో జరగదు. కానీ మీరు అనుకుంటే ఇంట్లోని మీ ఆడవారికి సెలవు ఇవ్వొచ్చు. సెలవు ఇవ్వకపోయినా వారి ఆరోగ్యం కోసం మీరు ఈ లడ్డూలు ట్రై చేయవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. అదే అవిసె గింజల లడ్డూలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి చాలా మంచివి. వారు స్ట్రాంగ్​గా ఉండడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈరోజు మీ ఇంట్లోని ఆడవారికి ఈ లడ్డూలు చేసి పెట్టేయండి. ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


అవిసె గింజలు - కప్పు


పల్లీలు - అర కప్పు 


తెల్ల నువ్వులు - అర కప్పు


ఎండు కొబ్బరి - అర కప్పు


బెల్లం - కప్పు


నీరు - పావు కప్పు


నెయ్యి - పాలు కప్పు


యాలకుల పొడి - చిటికెడు


పాలు - పావు కప్పు


తయారీ విధానం


స్టవ్ వెలిగించి దానిపై ఓ పాన్ పెట్టండి. దానిలో అవిసె గింజలు వేసి.. డ్రై రోస్ట్ చేయండి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్​లో పల్లీలు వేసి వేయించండి. అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అనంతరం తెల్ల నువ్వులు వేసి రోస్ట్ చేయండి. అవి చిటపటలాడుతూ దోరగా వేగే వరకు ఉంచి తీసి పక్కన పెట్టేయండి. అదే పాన్​లో కొబ్బరి పొడి వేసి రోస్ట్ చేయండి. దాని నుంచి మంచి వాసన వస్తూ.. కాస్త రోస్ట్ అయితే చాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వులు, కొబ్బరి, పల్లీలు, అవిసె గింజలు మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే లడ్డూ రుచి మారిపోతుంది.


ముందుగా పల్లీలు పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని ముందుగా వెయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్​ను పొడి చేసుకోవాలి. దానిని తీసి పల్లీలు వేసుకుని కాస్త బరకగా పొడి చేసుకోవాలి. నువ్వులు, కొబ్బరి కూడా వేసి పొడి చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవడం, ఒక్కొకటి విడిగా పిండి చేసుకోవడం వల్ల రోస్ట్ చేసుకున్నప్పుడు పిండి కలుపుతున్నప్పుడు ఇబ్బంది ఉండదు. లేదంటే కొన్ని తర్వగా వేగిపోతాయి. కొన్ని వేగవు అలాంటప్పుడు ముందు వేగినవి మాడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే మిక్సీ చేసుకునేప్పుడు అన్ని మెత్తగా అయిపోయే అవకాశముంది. అందుకే విడివిడిగా చేసుకోవాలి.


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టండి. దానిలో బెల్లం, నీరు వేసి తీగపాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండండి. దానిలో కాస్త యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపండి. ముందుగా తయారు చేసుకున్న పొడులన్నీ వేసి బాగా కలుపుకోండి. దీనిలో మరిగించిన పాలు వేసి మళ్లీ కలిపుకోండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోండి. అంతే వేడి వేడి అవిసె గింజల లడ్డూలు రెడీ. మీరు వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రెసిపీలో పాలు కలపకండి. నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకోండి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. పైగా ఇవి కేవలం రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. కాబట్టి మీరు ట్రై చేసి ఇంట్లో వారికి తినిపించేయండి.


Also Read : టేస్టీ, క్రంచీ మసాల వడలు.. సింపుల్ రెసిపీ ఇదే