Vada Recipe : పండుగల సమయంలో, ఇంట్లో ఏదైనా రుచిగా తినాలని అనుకున్నప్పుడు మీరు శనగపప్పుతో వడలు చేసుకోవచ్చు. ఇవి నోటికి రుచిగానూ, చేసేందుకు సింపుల్​గానూ ఉంటాయి. వీటిని కేవలం ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా మాత్రమే కాదు.. సాయంత్రం స్నాక్స్​గా.. మిగిలిపోతే కూరకోసం కూడా ఉపయోగించుకోవచ్చు. పండుగల సమయంలో అయితే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంతకీ ఈ టేస్టీ వడలను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


శనగపప్పు - 2 కప్పులు 


మినపప్పు - పావు కప్పు 


ఉల్లిపాయలు - 3


పచ్చిమిర్చి - 5


వెల్లుల్లి - 5 రెబ్బలు


అల్లం - 1 అంగుళం


సోంపు - 1 టీస్పూన్


జీలకర్ర - అర టీస్పూన్


ఉప్పు - రుచికి తగినంత


కరివేపాకు - 1 రెబ్బ


కొత్తిమీర - గుప్పెడు


నూనె - డీప్​ ఫ్రైకి సరిపడనంత


తయారీ విధానం


శనగపప్పు, మినపప్పును బాగా కడగాలి. అనంతరం వాటిని ఓ 5 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్​గా అయితే ఉదయం 11 గంటలకి నానబెట్టుకోవచ్చు. శనగపప్పును నానబెట్టుకుంటే గ్రైండ్ చేసుకునేప్పుడు ఈజీగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని బాగా సన్నగా తరుగుకోవాలి. అల్లం, వెల్లుల్లిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. శనగపప్పు, మినపప్పు నానిన తర్వాత మళ్లీ ఇంకోసారి కడిగి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మిక్సీ చేసే ముందు రెండు స్పూన్ల శనగపప్పును పక్కకు తీసి పెట్టుకోవాలి. పిండి మొత్తం మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే కొంచెం నీరు వేసుకోవచ్చు. 


మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకోవాలి. దానిలో ముందుగా తీసి పక్కన పెట్టుకున్న నానిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, సోంపు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పదార్థాలు అన్ని మిక్స్​ అయ్యేందుకు చేతితో కలిపితే మంచిది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడేంత నూనెను వేసి మీడియం మంట మీద వేడిచేయండి.


ఇప్పుడు పిండిలోని కొంత ముద్దని తీసుకుని వడలగా వత్తుకోవాలి. చేతులకు తడిచేసుకుని డైరక్ట్​గా వేసేయొచ్చు. లేదంటే ఏదైనా ప్లేట్​కి ఆయిల్​ రాసి వడలు చేసుకోవచ్చు. ఇలా వత్తుకున్న వడలను నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె మంచిగా వేడి అయిన తర్వాతనే వడ వేసుకోవాలి. లేదంటే పిండి కడాయి లోపల అతుక్కుపోతుంది. వడ ఒక వైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. రెండువైపులా వడ వేగిన తర్వాత రెండు గరిటలతో వాటిని నొక్కాలి. ఇలా చేయడం వల్ల వాటిలో నూనె మిగలదు. లేదంటే మీరు టిష్యూలు ఉపయోగించి నూనెను తగ్గించుకోవచ్చు. మిగిలిన మిశ్రమంతో కూడా ఇలా చేయండి.


ఈ వేడి వేడి వడలను మీరు కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో కలిపి తినొచ్చు. చట్నీ లేకుండా తిన్నా బాగానే ఉంటాయి. ముఖ్యంగా టీతో పాటు తీసుకుంటే ఆ రుచే వేరు ఉంటుంది. పిండిలో కాస్త నీరు ఎక్కువైతే.. దానిని కంట్రోల చేయడం కోసం మీరు శనగపిండిని కలుపవచ్చు. వడల రుచిని మరింత పెంచుకునేందుకు ఇంగువ వేసుకోవచ్చు. వడలను మీరు వేయించిన వెంటనే తింటే మంచి క్రిస్పీగా, నోటికి రుచిగా ఉంటాయి. వీటితో మరో ప్రయోజనం ఉందండోయ్.. ఒకవేళ వడలు మిగిలిపోతే మీరు వాటితో కూర కూడా చేసుకోవచ్చు. 


Also Read : దోశపిండితో వేడి వేడి పునుగులు.. బెజవాడ స్టైల్ రెసిపీ