భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ పార్టీ జై కొట్టింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా(Margaret Alva)కు మద్దతు ప్రకటించింది. అల్వాకే మద్దతు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు 16 మంది ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 


టీఆర్ఎస్ మద్దతుపై ప్రకటన.. 
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ఎవరికో అన్న చర్చ ఇన్నాళ్లూ నడిచింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణలో ద్రౌపది ముర్ముకు కేవలం బీజేపీకి ఉన్న మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగతావన్నీ ప్రతిపక్ష పార్టీ తరఫు అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే లభించాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి తెలంగాణ కీలకంగా మారనుంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఇవాల్టి వరకు టీఆర్ఎస్ నోరు మెదప లేదు. కానీ నేడు అనూహ్యంగా తమ నిర్ణయాన్ని వెల్లడించింది.


చివరి నిమిషంలో నిర్ణయం వెల్లడి.. 
ఉపరాష్ట్రపతి విషయంలో విపక్షాల అభ్యర్థిగా మార్గరేట‌్ అల్వాను చర్చలు లేకుండానే ప్రకటించేశారు. ఈ కారణంగా మమతా బెనర్జీ మద్దతు ప్రకటించలేమని పేర్కొంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో టీఆర్ఎస్ దూరంగా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వచ్చాయి. మద్దతు ఇస్తే కాంగ్రెస్‌తో దోస్తానా కట్టినట్లు బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని... దాన్ని ఎదుర్కొనే వ్యూహాన్ని కూడా టీఆర్‌ఎస్‌ రెడీ చేసింది. దూరంగా ఉంటే స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయిందనే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని కూడా భావించింది. అందుకే చివరి వరకు నాన్చి ఆఖరి క్షణంలో అంటే ఓటింగ్‌కు ఒక్కరోజు ముందు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని ప్రకటించింది.  


పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటకకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అల్వా పేరును విపక్షాల పార్టీల సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. 


బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన జగదీప్ ధన్ ఖడ్.. అనేక విషయాల్లో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. పలు సందర్బాల్లో ధన్‌ఖడ్ తీరును కేసీఆర్ కూడా తప్పు పట్టారు. అయితే అనూహ్యంగా విపక్షాల కూటమి అభ్యర్థికి తాము మద్దతిచ్చేది లేదని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించింది. దీంతో  విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు మొదటి షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న చర్చ ఇన్నిరోజులు నడిచింది. కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వడంతో విపక్షాలు కాస్త రిలీఫ్‌ అయ్యాయని చెప్పొచ్చు. 


ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ ఆగస్టు 6న(శనివారం) జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‍సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్​ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే.