Fine For TSRTC Bus: ఆర్టీసీ బస్సు ఆలస్యంగా వచ్చిందని.. తెలంగాణ ఆర్టీసీకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. లేటుగా రావడమే కాకుండా గమ్య స్థానానికి చేర్చడంలో చాలా ఆలస్యం చేశారు. దీంతో ఓ ప్రమాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో ఓ వినియోగదారుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించగా.. తెలంగాణ ఆర్టీసీకి జరిమానా విధించింది. టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా వెయ్యి రూపాయలు, కేసు ఖర్చుల కింద 500 రూపాయలు.. మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..?
2019వ సంవత్సరం ఆగస్టులో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్.. దిల్‌సుఖ్ నగర్ నుంచి మణుగూరుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆగస్టు 9వ తేదీన బస్టాండుకు వెళ్లారు. అయితే రాత్రి 7.15 గంటలకు రావాల్సిన బస్సు 11.15కు వచ్చింది. దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఎందుకు ఇంత ఆలస్యం అయిందని ఫహీమ ప్రశ్నించగా.. దురుసుగా మాట్లాడారు. అంతే కాకుండా మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు గమ్య స్థానానికి చేర్చాల్సి ఉండగా.. 9.45 కు చేర్చింది. అయితే బస్టాండులో నాలుగు గంటల పాటు వేచి ఉండటంతో ఫహీమ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఫహమీ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.
ఆమె చేసే ఆరోపణలన్నీ నిరాధారమైనవి..
ఫిర్యాదుపై స్పందించిన వినియోగదారుల కమిషన్.. ఆర్టీసీని విచారించింది. అయితే ఫహీమ చేసే ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ప్రయాణం రద్దయితేనే టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని ఫిర్యాధి దారులకు నష్టం కల్గించేలా ఆర్టీసీ ప్రవర్తించలేదని తమ సేవల్లో లోపం లేదని వివరించింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షురాలు చిట్నేని లతా కుమారి, సభ్యులు జీవీఎస్ ప్రసాద్ రావు, డీ మాధవీ లతతో కూడిన బెంచ్ తెలంగాణ ఆర్టీసీకి ఫైన్ విధించారు.
బస్సు ఆలస్యం వల్లే ఫహీమకు అస్వస్థత..
నిజంగానే మణగూరుకు 2 గంటల 20 నిమిషాలు బస్సు ఆలస్యంగా చేరుకున్నట్లు బెంచ్ గుర్తించింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆలస్యంగా రావడం వల్ల ఫిర్యాదిదారు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు ధ్రువీకరించిన ప్రిస్కిప్షన్ సాక్ష్యంగా ఉందని, ఇది ముమ్మాటికీ సేవల్లో లోపమే అని తెలిపారు. అంతే కాకుండా టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా మరో 1000 రూపాయలు, కేసు ఖర్చుల కింద 500 రూపాయలు.. మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో ఆమెకు చెల్లించాలని సూచించింది.
Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ముగిసిన ఛాలెంజ్ డెడ్‌లైన్, చౌరస్తాకు కౌశిక్ రెడ్డి - భారీగా ఉద్రిక్తత, తోపులాటలు
ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌లలో ‘టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్’ అనే యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఏ బస్సు ఎక్కడుందోతెలియజేసే ట్రాకింగ్ సేవలను మంగళవారం (జూలై 26) ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే రైళ్లలో ఈ సదుపాయం ఉంది. రైల్ యాత్రి అనే యాప్ ద్వారా రైలు లైవ్ స్టేషన్ ను తెలుసుకోవచ్చు.