TRS Plenary Meeting: టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట అని, దీన్ని ఎవరూ బద్దలు కొట్టలేని కోటలా తయారైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి అని, ఇది ఏ వ్యక్తిదో లేక శక్తిదో కాదని చెప్పారు. పరిపాలనలో భాగస్వాములైన 80 శాతం మంది ప్రజా ప్రతినిధులతో సుమారు రూ.వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా టీఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిందని అన్నారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తున్న కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అని అభివర్ణించారు. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.


తెలంగాణ ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవార్డులు వస్తున్నాయని, గుర్తింపు రాకుండా ఉన్న శాఖ ఒక్కటీ లేదని అన్నారు. దేశంలోని పది ఉత్తమ గ్రామాల్లో అన్నీ తెలంగాణ గ్రామాలే ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కూడా ప్రసారం చేస్తున్నాయని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీటి, తాగునీటి రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని అన్నారు. ఇవి మన పరిపాలనకు, పని తనానికి నిదర్శనమని అన్నారు. 


టీఆర్ఎస్ నాయకులు, పార్టీ కోసం పాటుపడుతున్న నేతలు, కార్యకర్తల కృషే ప్రస్తుతం మనం చేసుకుంటున్న సంబరాలు అని అన్నారు. తెలంగాణలో అవినీతితో ప్రజా ప్రతినిధిని సస్పెండ్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవని అన్నారు. ఇటీవల కర్ణాటకలో ఓ మంత్రిని సస్పెండ్ చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.


ప్రొఫెసర్ జయశంకర్, సీహెచ్ విద్యాసాగర్ లాంటివారు ఢిల్లీలో ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపారని గుర్తు చేసుకున్నారు. లబ్ధ ప్రతిష్ఠులైన రాష్ట్రాలను వెనక్కి నెట్టి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయం దేశం కంటే ఎంతో ఎక్కువగా ఉందని అన్నారు.


‘‘ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం 11 లక్షల కోట్లుగా ఉంది. మనం పని చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పని చేసి ఉంటే మన తలసరి ఆదాయం 14.5 లక్షల కోట్లుగా ఉండేది. ఈ విషయాన్ని కాగ్ తేల్చి చెప్పింది. 


దేశంలో అనవసర జాఢ్యాలు పెరుగుతున్నాయి
‘‘స్వాతంత్ర్య ఫలాలు పూర్తిగా ప్రజలకు లభించడం లేదు. పెడధోరణులు ప్రబలిపోతున్నాయి. దేశంలో కొన్ని అవాంఛితమైన, అనారోగ్యకరమైన పోకడలు చూస్తున్నాము. ఇవి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఇవి దేశ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక రాజకీయ పార్టీగా దేశ అభ్యున్నతి కోసం కీలక నిర్ణయం తీసుకోవాలి. దేశంలో 4 లక్షల మెగావాట్లు విద్యుత్ శక్తి ఉంటే ఏ ఒక్క రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుత్ వాడడం లేదు. ఆఖరికి గుజరాత్‌లో కూడా భయంకరమైన కరెంటు కోతలు ఉన్నాయి. దేశంలో కరెంటు కోతలు లేని రాష్ట్రమే లేదు. చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా తెలంగాణ వెలుగుతోంది. తెలంగాణ అనుసరించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఫాలో అవ్వడం లేదు? ఈ విషయాన్ని నేను నీతి ఆయోగ్ సమావేశంలోనే చెప్పాను. కానీ, లాభం లేదు.’’ అని కేసీఆర్ మాట్లాడారు.