తెలంగాణలో మరో రెండ్రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరి పాలనపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ హైదరాబాద్ లో భారీ ఎత్తున ఫ్లెక్లీలు పెట్టారు. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫ్లెక్సీలపై ‘సాలు దొర’, ‘సంపకు దొర’ అంటూ స్లోగన్లు రాశారు. ఇది సహించని ప్రత్యర్తి పార్టీ లీడర్లు ఆ ఫ్లెక్సీలకు పోటీగా కటౌట్లను పెట్టారు.


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లను కవర్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. దానికి దీటుగా ‘సాలు దొర - సంపకు దొర’ అంటూ నిన్న బీజేపీ నేతలు కేసీఆర్ ను విమర్శిస్తూ హోర్డింగ్స్‌ పెట్టారు. దీనికి టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ‘సాలు మోదీ - సంపకు మోదీ’ అంటూ టీఆర్ఎస్ నేతలు హోర్డింగ్‌లు పెట్టారు. ఈ భారీ ఫ్లెక్సీలపై ప్రశ్నలు సంధించారు. బాయ్ బాయ్ మోదీ అంటూ హ్యాష్ ట్యాగ్ ని కూడా పెట్టారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరై ఇక్కడే రెండు రోజులు బస చేయనున్న వేళ పోటాపోటీగా పెట్టిన ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.


మోదీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ప్రధాని సభ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలోని పరేడ్ గ్రౌండ్ చుట్టూ బై బై మోదీ పోస్టర్లు పెట్టారు. ఆ పోస్టర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు దానిని తొలగించారు.


ఫ్లెక్సీల విషయంలో పై చేయి సాధించేందుకు ఈ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలతో టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నాలకు భంగం కలిగించేలా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోంది. ముఖ్యంగా నగరంలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ పై ఉండే లాలీపాప్స్ అన్నింటిని అధికార పార్టీ ముందే ఆధీనంలోకి తీసుకుంది. పరేడ్ గ్రౌండ్‌లోకి వీఐపీలు వెళ్లే గేట్ వద్ద, బస్సు షెల్టర్స్‌కు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వెళ్లే ప్రధాన గేటు దగ్గర కూడా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.