హోరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన అధికారులు తక్షణం స్పందించడంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. యాదాద్రి జిల్లాలో బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్య ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
అధికారులు చెప్పిన వెంటనే ప్రయాణికులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అగ్ని కీలల్లో తగలబడిపోయాయి. చుట్టూ పొగ అలుముకుంది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు.
ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా బోగీలకు నిప్పు అంటుకోకుండా మండుతున్న బోగీలను మిగతా బోగీలతో లింక్ తప్పించారు.
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే?
ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ప్రత్యక్ష సాక్షులు వణికిపోతున్నారు. ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఛార్జింగ్ పాయింట్ సమీపంలో సిగరెట్ తాగారని అంటున్నారు. అక్కడ సిగరెట్ కాల్చవద్దని పదే పదే అతనికి హెచ్చరించినా వినిపించుకోలేదని వివరిస్తున్నారు. దీని వల్ల ఎస్ 4లో మంటలు చెలరేగాయన్నారు. అవి క్షణాల్లోనే మిగిలిన మూడు బోగీల్లోకి వ్యాపించాయంటున్నారు.
ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
ఇప్పుడు ప్రమాదానికి గురైన బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను తరలించడానికి ప్రత్యేక చర్యలు అధికారులు తీసుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా నాలుగు బస్‌లను ఏర్పాటు చేశారు. సేఫ్‌గా ఉన్న బోగీలను సురక్షితంగా సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితమే బెదిరింపు లేఖ
దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు రోజుల క్రితం ఓ బెదిరింపు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి ఫ్రమ్ అడ్రెస్ లేకుండానే వచ్చిందా లేఖ. మరో నాలుగు రోజుల్లో ఒడిశా తరహా ఘటన చూడబోతున్నారంటూ హెచ్చిరంచిన ఆగంతకులు. ఈ యాంగిల్‌లో కూడా రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.