బతుకమ్మ పండుగ నేటితో ముగియనున్నందున హైదరాబాద్ లో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం (అక్టోబరు 3) మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, డైవెర్షన్‌లు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్
బషీర్‌బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల, అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ, కట్ట మైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్, బైబిల్ హౌస్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని అందువల్ల వాహనదారులు వేరే మార్గాలు చూసుకోవాలని సూచించారు.
భారీ బందోబస్తు
బతుకమ్మ వేడుక సజావుగా జరిగేందుకు బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు.
దాదాపు 3 వేల మంది మహిళలు ఎల్బీ స్టేడియం బతుకమ్మ సంబరాల్లో పాల్గొననున్నారు. బతుకమ్మ ఆడిన తర్వాత ఆ బతుకమ్మలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. అంతేకాకుండా, నేడు హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ 74 బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేసింది. వాటిలోనే దుర్గాదేవి విగ్రహాలను కూడా నిమజ్జనం చేయనున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద బతుకమ్మ నిమజ్జనాన్ని చూసేందుకు దాదాపు 10 వేల మంది మహిళలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్యాంక్ బండ్ కాకుండా సరూర్ నగర్, ఐడీఎల్, హస్మత్ పేట్, ప్రగతి నగర్, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లె చెరువు, పెద్ద చెరువుల్లో కూడా బతుకమ్మలను నిమజ్జనం చేయవచ్చని అధికారులు సూచించారు.
బతుకమ్మ ఘాట్ ల పునరుద్ధరణ కోసం జీహెచ్ఎంసీ కోటి రూపాయలు వెచ్చించింది. మహిళలు, పురుషులకు వేర్వేరు సంచార టాయ్ లెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చాటడానికి జీహెచ్ఎంసీ దాదాపు 740 ఆర్టిఫిషియల్ బతుకమ్మలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసింది.
ఆఖరి రోజున సద్దుల బతుకమ్మ
ఇప్పటికే ఎంగిలిపూల బతకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ అంటూ వివిధ పేర్లతో నిర్వహించగా చివరి రోజు సద్దుల బతుకమ్మ చేస్తారు. ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లవర్ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభయ్యే ఈ వేడుకలు నేడు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.
ఈ బతుకమ్మ సంబరాల ఏర్పాట్లపై సమీక్షను గత వారమే చేశారు. అక్టోబరు 3న ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత సోమవారం సాంస్కృతిక, పర్యాటక, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, జలమండలి, ఆర్‌అండ్‌బీ, ఉద్యాన, విద్య, సమాచార, అగ్నిమాపక, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..వివిధ శాఖల తరఫున చేయాల్సిన ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలని సూచించారు.