నేడు (జూలై 5) బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు భారీగా ఉండనున్నాయి. ఈ కల్యాణంలో ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అంతేకాక, వేల సంఖ్యలో భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. దీంతో సాధారణ సమయంలోనే రద్దీగా ఉండే బల్కంపేట రహదారి పూర్తిగా మూసుకుపోనుంది. భారీగా వచ్చే భక్తుల కోసం క్యూ లైన్ల ఏర్పాటుతో నేడు ఆ ప్రాంతం రద్దీగా మారనుంది.
అందుకోసం పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసరాల్లోనే కాకుండా అక్కడికి వచ్చే చుట్టుపక్కల అన్ని రూట్లలో ఆంక్షలను విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మంగళవారం అమ్మవారి కల్యాణం, బుధవారం రథోత్సవం సందర్భంగా ఆ రోజుల్లో వాహనదారులు వేరే దారులు చూసుకోవాలని ఆయన కోరారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
* ఫతేనగర్ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట ప్రధాన రహదారిపైకి అనుమతించరు. కాబట్టి, వాహనదారులు బల్కంపేట–బేగంపేట లింక్ రోడ్డులోకి వెళ్లి, కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్, దుర్గ గుడి, సత్యం థియేటర్ రోడ్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎస్‌ఆర్ నగర్ టీ జంక్షన్ వద్ద మళ్లీ ఎస్‌ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకే గూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్ నగర్ ఎక్స్‌రోడ్డు, సనత్ నగర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
* ఎస్‌ఆర్ నగర్ ‘టీ’జంక్షన్ నుంచి ఫతేగర్ వైపు వెళ్లే బై - లేన్స్, లింక్ రోడ్లను మూసేశామని పోలీసులు తెలిపారు.
ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు
ఎల్లమ్మ కల్యాణం వీక్షించేందుకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆర్ అండ్ బీ ఆఫీసు, అమీర్‌పేట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.