Hyderabad Software Engineer Murder: హైదరాబాద్ కేపీహెచ్‌బీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకోవడంతో భరించలేని అతని మామ (భార్య తండ్రి) హత్య చేయించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం టెకీ అయిన నారాయణ రెడ్డి అనే 25 ఏళ్ల వ్యక్తిని హత్యచేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. జిన్నారంలోని అడవిలో నారాయణరెడ్డి శవాన్ని తగులబెట్టిన ప్రదేశానికి ఈ నెల 2న రాత్రి పోలీసులు వెళ్లినప్పుడు ఎడమ కాలు దూరంగా పడి ఉంది. కేవలం ఎముకలే కనిపించాయి.


అయితే, ఈ ఘటనలో పోలీసులు కీలక వివరాలను రాబట్టారు. సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీరు నారాయణ రెడ్డి హత్యకు మామ కందుల వెంకటేశ్వర్‌ రెడ్డి దాదాపు రూ.4.50 లక్షలకు సుపారీ ఇచ్చినట్లుగా తేలింది. అందుకోసం తమ దూరపు బంధువునే నియమించుకున్నాడు. 


నిజానికి ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం అయినా తన కూతుర్ని నారాయణ రెడ్డి పెళ్లి చేసుకోవడం మామ కందుల వెంకటేశ్వర్ రెడ్డికి నచ్చలేదు. ప్రకాశం జిల్లా రాజువారిపాలెం గ్రామానికి చెందిన యువకుడు నారాయణరెడ్డి పెళ్లి చేసుకొని ఢిల్లీలో ఉంటున్నారు. తర్వాత పెద్ద వేడుక చేయిస్తానంటూ వారిని నమ్మించి వెంకటేశ్వర్ రెడ్డి వారిని స్వస్థలం రప్పించాడు. వెంటనే కూతుర్ని హౌస్ అరెస్టు చేశారు. ఆమెకు మళ్లీ పెళ్లి చేద్దామనుకుంటే సంబంధాలను వద్దని చెప్తుండడంతో వెంకటేశ్వర్‌ రెడ్డి తట్టుకోలేక అల్లుడు నారాయణరెడ్డి హత్యకు పథకం వేశాడు. బంధువర్గంలోని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని సుపారీకి పెట్టుకోగా, అతను రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడు. చివరికి 4.5 లక్షలకు బేరం కుదిరింది.


షేక్‌పేటలో అద్దెకు ఇల్లు
ప్రణాళిక ప్రకారం శ్రీనివాస్ రెడ్డి  షేక్‌పేట సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడే నారాయణరెడ్డి హత్యకు ప్లాన్ చేశారు. జూన్‌ 27న నారాయణరెడ్డిని కారులో బయటకు తీసుకెళ్లి మెడకు టవల్‌ చుట్టి ఊపిరాడకుండా చేశారు. అదే కారులో జిన్నారం శివారు రహదారి పక్కన అటవీ ప్రాంతంలోకి శవాన్ని తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.


కాల్‌ డేటాతో నిర్ధారణ
నారాయణ రెడ్డి మిస్సింగ్ అని తొలుత కేసు పెట్టుకున్న పోలీసులకు తర్వాత అతని కాల్ డేటా సాయంతో మొత్తం కూపీ లాగారు. అలా తొలుత హత్యకు సహకరించిన ఆశిశ్ అనే వ్యక్తి దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.


హత్య జరిగాక నారాయణరెడ్డిని చంపేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ ద్వారా వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇద్దరూ తలో దిక్కుకూ పారిపోయారు. అక్కడి నుంచి మళ్లీ వెంకటేశ్వర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి తనకు డబ్బు కావాలని అడిగాడు. నెల తర్వాత ఇస్తానని చెప్పడంతో ముగ్గురూ అక్కడి నుంచి విడిపోయారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి, కాశీ అనే వ్యక్తులు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.