టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవుడి జీవనం మరింత సులువు అవుతోంది. కార్లలో డ్రైవర్ లేకుండా నడిచే టెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ ఆ దిశగా అద్భుత ఫలితాలు సాధించి ఆ టెక్నాలజీని తన కార్లలో జోడించింది. తద్వారా అమెరికాలో ఉండే టెస్లా కార్లు సెల్ఫ్ డ్రైవింగ్, సెల్ఫ్ పార్కింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
అయితే, తాజాగా హైదరాబాద్‌లోనూ తనంత తానుగా నడిచే డ్రైవర్ రహిత కారుపై పరిశోధన జరిగింది. అంతేకాకుండా, దేశంలోనే మొదటిసారిగా మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు తయారుచేసే సాంకేతికతను కూడా ఐఐటీ హైదరాబాద్ అందుబాటులోకి తెచ్చింది. మామూలు వాతావరణంలో వీటిని పరీక్షించేలా 2 కిలోమీటర్ల పొడవైన ట్రాక్ నిర్మించారు. సిగ్నల్స్, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్ల మీద ఉండే తరహాలో అడ్డంకులను ఈ ట్రాక్ పైన ఏర్పాటు చేశారు.
డ్రైవర్ లేకుండా 2 కిలోమీటర్లపాటు ఓ కారుని నడిపించి టెస్టు చేశారు. ఇటువంటి సాంకేతిక ప్రయోగం దేశంలోనే ఇదే మొదటిది అని పరిశోధకులు తెలిపారు. తాజాగా ఇక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఏకంగా ఈ డ్రైవర్ రహిత కారులో ప్రయాణం చేశారు. ఐఐటీ హైదరాబాద్ లో ప్రొఫెసర్ రాజలక్ష్మి లీడర్ షిప్‌లో దాదాపు 40 మందికి పైగా యువ రీసెర్చర్స్ ఈ ఆవిష్కరణలో పార్టిసిపేట్ చేశారు.
భారీ డ్రోన్లు కూడా
వీరు డ్రైవర్ లేకుండా నడిచే కార్లు మాత్రమే కాకుండా, మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, ఎవరి అవసరం లేకుండా వాటంతట అవే నడిచే సైకిళ్ల తయారీపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఇవన్నీ వివిధ పరీక్షల దశలో ఉన్నాయి. వ్యవసాయం కోసం పొలంలో ఉపయోగించేలా రకరకాల డ్రోన్లను కూడా తయారు చేస్తున్నారు. కేవలం 20 గ్రాముల బరువున్న అతి చిన్న డ్రోన్‌ను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు.
డ్రైవర్ రహిత వెహికిల్స్ ను వచ్చే ఆగస్ట్ నెల నుంచి ఐఐటీ క్యాంపస్ లో నడిపేలా ప్రణాళికలు చేస్తున్నారు. నేషనల్ మిషన్‌లో భాగంగా ఇక్కడ సైబర్ ఫిజికల్ సిస్టమ్ ను కూడా డెవలప్ చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఈ రీసెర్చ్ ల కోసం ఏకంగా రూ.135 కోట్ల రూపాయలను సమకూర్చింది. ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి వస్తే రవాణ వ్యవస్థలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్, ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు బీవీఆర్ మోహన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రొఫెసర్ పి.రాజలక్ష్మి, రీసెర్చ్, డెవలప్‌మెంట్ విభాగం డీన్ ఆచార్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.