ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించాలని వారు సీఎస్‌కు మెమోరండం అందజేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యను పరిష్కరించాలని వారు సీఎస్ ను కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి.. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎస్ ను కోరారు. టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.


సీఎస్‌ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజాహరుద్దీన్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ పలువురు నేతలు ఉన్నారు.