Producer Anji Reddy: సినీ నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి మృతి కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసమే అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని తేల్చారు. విదేశాల్లో స్థిరపడేందుకు ఇక్కడ ఉన్న ఆస్తులను అమ్మే క్రమంలో.. అంజిరెడ్డి ఆస్తులపై కన్నేసిన జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేశ్.. అంజిరెడ్డిని దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.


పద్మారావునగర్ కు చెందిన జి.అంజిరెడ్డి నిర్మాతగా కొన్ని తెలుగు సినిమాలు నిర్మించారు. ఆయనకు ముగ్గురు సంతానం. ఒక కుమారుడు మోకిల్లాలో, మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. అయితే అంజిరెడ్డి అమెరికాలో ఉండాలని భావించి పౌరసత్వానికి దరఖాస్తు చేశారు. ఇటీవలే అది రాగా ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. నిర్మాతగా ఉన్న సమయంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఆస్తుల విక్రయం విషయం చర్చించి, 8 నెలల క్రితం ఆయన అమెరికాకు వెళ్లారు. రవి ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ కు చెందిన ఏజెంట్లు, వ్యాపారులు ఉండే వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. నెల రోజుల క్రితం భార్యతో పాటు హైదరాబాద్ కు తిరిగి వచ్చిన అంజి రెడ్డి వద్దకు.. రవి కాట్రగడ్డ తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేశ్ ను తీసుకువచ్చారు. 


పద్మారావునగర్ లోని ఇల్లు తనకు నచ్చిందని, తాను కొంటానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించి రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చిదిద్దుతానని తరచూ చెప్పేవాడు. సైదాబాద్ లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి బావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందంటూ ఇద్దరు మహిళలను పరిచయం చేశాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22వ తేదీన ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29వ తేదీన రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తి అవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు.


ఎలాంటి నగదు చెల్లించకుండానే అంజిరెడ్డికి పద్మారావునగర్ లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీని కోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వృద్ధుడు కావడంతో ఆయనకు ఏదైనా అయితే మరో రూ. 50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్ లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని బావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్ కు వెళ్లిన రాజేష్.. అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్ రెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు.


అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్ లోకి ప్రవేశించారు. పార్కింగ్ లో అంజిరెడ్డిని రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్ లో పని చేసే ఇద్దరు బీహారీలు దారుణంగా హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో అంజిరెడ్డిది హత్యగా తేల్చారు.