Weather Today: తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఇంట్లో ఉన్నా సరే ముసుగు తీయాలంటే జడుసుకుంటున్నారు. దీనికి తోడు జలుబు జ్వారాలు జనాలను మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం పది గంటలకి కూడా కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కనిపించడం లేదు. వృద్ధులు, చిన్న పిల్లలు, గుండె జబ్బులు ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. పొలం పనులకు వెళ్లే వాళ్లు పొగమంచు, చలికి రోగాల బారిన పడుతున్నారు.
తెలంగాణలో వాతావరణం(Telangana Weather Today)
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చలి తీవ్రతకు జనాలు రూమ్ హీటర్లు, చలి మంటలు పెట్టుకంటున్నారు. ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే సిబ్బంది, బడులకు వెళ్లే విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో 5.8 డిగ్రీల మంగళవారం ఉష్ణోగ్రత నమోదైంది.
సాధారణ ఉష్ణోగ్రత 1.6 నుంచి ౩ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాలు:- భద్రాచలం, దుండిగల్, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్.
సాధారణ ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాలు:- హకీంపేట, హనుమకొండ
సాధారణ ఉష్ణోగ్రత 5 డిగ్రీల కంటే ఎక్కువగా పడిపోయిన ప్రాంతాలు:- ఆదిలాబాద్, మెదక్, పటాన్‌చెరు
హైదరాబాద్‌లో వాతావరణం (Hyderabad Weather today)
హైదరాబాద్ , దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 13 డిగ్రీ ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈశాన్య దిశలో గంటకు 2 నుంచి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 11.9 డిగ్రీలు నమోదు అయింది.
హైదరాబాద్‌లో రోజంతా చలి చంపేస్తోంది. జనం బయటకు వచ్చి ఆఫీసులకు వెళ్లి రావాలంటే వణికిపోతున్నారు. సాయంత్ర ఐదు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు. పొగమంచు వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Andhra Pradesh Weather Today)
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ఉంది. ఓవైపు వర్షాలు భయపెడుతుంటే... మరోవైపు ఎముకలు కొరికే చలి తెగ ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఈ వాతావరణం రైతులను కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. అసలే చేతికి పంట వస్తున్న టైంలో ఓ వైపు వర్షం మరోవైపు పొగ మంచు నష్టాన్ని మిగులుస్తుందని భయపడుతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని కారణంగా విజయనగరం,విశాఖ,అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.