Telangana News | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇదివరకే అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతి పత్రాన్ని సీఎస్ శాంతికుమారికి పంపించారు. ఆ లేఖను ఏసీబీ అధికారులకు అందజేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి లేఖను తెలంగాణ సిఎస్ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు అందించారు. 


ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను విచారణ


బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలతో పాటు ఫార్ములా ఈ రేస్ (formula e hyderabad) ) వ్యవహారంపై మంత్రివర్గంలో చర్చించారు. ఈ క్రమంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరడంపై గవర్నర్ ఇచ్చిన అనుమతి పై చర్చ జరిగింది. కేటీఆర్ ను విచారించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సిఎస్ శాంతి కుమారి గవర్నర్ అనుమతి లేఖను ఏసీబీకి పంపించారు. ఈ వ్యవహారంపై ఇదివరకే నమోదైన కేసులో అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్‌ ఇంజినీర్‌ను బాధ్యులుగా చేర్చారు.


నెల రోజుల తరువాత గవర్నర్ అనుమతి


హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడంపై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేయడానికిగానూ గవర్నర్‌ను ప్రభుత్వం అనుమతి కోరింది. దాదాపు నెల రోజుల తరువాత గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌కు కీలకమైన కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని, సాధ్యమైనన్ని అంశాలపై చర్చించే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరిన గంటల వ్యవధిలో సీఎస్ నుంచి ఏసీబీకి బీఆర్ఎస్ నేతను విచారించేందుకు రంగం సిద్ధమైంది.



అరెస్ట్ ప్రచారం సమయంలో ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్


తనను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో ఎదురుచూస్తోందని, అక్రమ కేసుల్లోనైనా సరే తనను జైల్లో పెట్టే అవకాశం ఉందని కేటీఆర్ ఇదివరకే పలుమార్లు ప్రస్తావించారు. తన మీద ఫార్ములా కార్ రేసులో ఆరోపణలు వచ్చిన సమయంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని గతంలో లేఖ రాసిన కేటీఆర్, అనంతరం నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనను కాంగ్రెస్ తమకు అనుకూల ప్రచారం చేసుకుంది. తనను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పెద్దలను సాయం కోరేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని హస్తం పార్టీ నేతలు ఆరోపించారు.


Also Read: KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్