Telangana News | హైదరాబాద్: రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తే ఆయన వీపులు పగలడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడకు వెళ్లినా కనీసం 500, 600 మంది సెక్యూరిటీని వెంట బెట్టుకుని వెళ్లాలని, లేకపోతే కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వీపులు పగలగొడతారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించి, ప్రజా సమస్యలతో పాటు తమపై చేసిన ఆరోపణలపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. 


రేవంత్ రెడ్డికి అంత సీన్ ఉందా?


తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ డైలాగులు ఎలా ఉంటాయంటే.. కేసీఆర్ దమ్ముంటే రా అంటాడు. నిజంగా ఆయనకు అంత సీన్ ఉందా. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే బీఆర్ఎస్ వాళ్లనే ఆయన తట్టుకోలేకపోతుండు. అలాంటి రేవంత్ రెడ్డికి కేసీఆర్ రావాలంట. నీకు ఇది అవసరమా. చిట్టి నాయుడువి చిన్న మనిషివి. చిట్టెలుకవి. ఆయనను ఎదుర్కొనేందుకు కేసీఆర్ కావాలా? అంత లేదు నీకు అని మొన్న మేం చెప్పినం. 




నేను రేవంత్‌ లాగ కాదు, సంస్కారం ఉంది


రేవంత్ రెడ్డి లాగ నేను ఆవారా కాదు. పెద్ద చదువులు చదువుకున్న, సంస్కారం ఉంది. రేవంత్ లాగ దిగజారి మాట్లాడలేను. బయటి దేశం వెళ్లి జాబ్ తెచ్చుకుని, వర్క్ చేశాను. అంతో కొంతో పేరు తెచ్చుకున్నాను. ఆయన తీరు చూశాక గిట్ల చెప్తేనే బుద్ధి వస్తదని అర్థమై మాట్లాడుతున్న. మగాడివైతే నువ్వు అసెంబ్లీ 15 రోజులు పెట్టు రేవంత్ రెడ్డి. లగచర్ల, గురుకుల స్కూళ్ల సమస్యలు సహా రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చిద్దాం. ఆరు గ్యారంటీల అమలు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఎందుకు చనిపోతున్నారో కూడా మాట్లాడుదాం. బోనస్ ఎందుకు ఇస్తలేరో చర్చ జరగాలి. రాష్ట్రం అప్పులపాలైందని చేస్తున్నావు. ఆ స్కాం ఈ స్కాం అని దుష్ప్రచారం చేస్తున్నావు. నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు వీలున్నన్ని రోజులు నిర్వహించు. నువ్వు చేసే ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చి బుద్ధి చెబుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.  


కొడంగల్ నుంచే రేవంత్ పతనం ఆరంభం


క్యాబినెట్ మీటింగ్ పేరుతో ఎవరిని అరెస్ట్ చేయాలో చర్చించడం కాదు. పాలన అంటే ప్రజల కోసం చర్చించడం. కొడంగల్ ప్రజల కోసం నిలబడ్డ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉక్కు మనిషిగా మారి, సీఎం రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో తుక్కు తుక్కు చేస్తాడు. లగచర్ల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుంది, రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. కానీ సీఎం అయ్యాక రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కాడు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదు.



రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లె లేక రాష్ట్రంలోని ఏ గ్రామమైనా ఈ సవాళ్లకు సిద్ధమని చెబితే, సీఎం రేవంత్ పారిపోయాడు.  తెలంగాణలో 30 శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ నాయకులు మాత్రం సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు - కేటీఆర్


Also Read: Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం