Show Cause Notice To Sandhya Theater: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) మంగళవారం ఆస్పత్రిలో బాలున్ని పరామర్శించారు. 'బాలునికి చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునేందుకు టైం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు. ప్రభుత్వ పరంగా బాధిక కుటుంబానికి అండగా ఉంటాం.' అని సీపీ తెలిపారు. కాగా, ఏబీపీ దేశం చొరవతో సీపీ సీవీ ఆనంద్, వైద్యులు బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై తాజాగా స్పందించారు. సోమవారం ఈ అంశంపై ఏబీపీ ప్రతినిధి సీపీ, వైద్యులను ప్రశ్నించారు.
థియేటర్‌కు షోకాజ్ నోటీసులు
మరోవైపు, ఈ కేసుకు సంబంధించి సంధ్య థియేటర్‌కు సీపీ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలన్నారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అటు, ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను 2 రోజుల క్రితం అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. ఈ బెయిల్ రద్దు చెయ్యాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పై అధికారుల నుంచి అనుమతి రాగానే ఈ పిటిషన్ వేసే అవకాశం ఉందని సమాచారం. క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారని ఇలా చేయడం న్యాయపరంగా కరెక్ట్ కాదని పోలీసులు చెబుతున్నారు. క్రౌడ్‌ను కంట్రోల్ చేయకుండా పోలీసులు అల్లు అర్జున్ చుట్టూ ఉన్నారని.. ఆయన వద్దే గుమికూడారని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు, క్వాష్ పిటిషన్ విచారించి బెయిల్ ఇవ్వడం వంటి అంశాలను హైలెట్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
వెలుగులోకి ఆ లెటర్..
కాగా, ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా నటీనటులు సంధ్య థియేటర్‌కు వస్తున్నారని ముందుగానే పీఎస్‌లో వినతిపత్రం ఇచ్చినట్లు థియేటర్ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. అయితే, ఈ లేఖకు పోలీసులు రిప్లయ్ ఇచ్చిన లెటర్ సైతం సోమవారం వైరల్ అవుతోంది. క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని కాబట్టి థియేటర్‌కు ఎవరూ రావొద్దని చిక్కడపల్లి పోలీసులు ముందుగానే హెచ్చరించినట్లు ఓ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్‌కు ఇరువైపులా రెస్టారెంట్లు ఉన్నాయని.. నటీనటులొస్తే భద్రత కల్పించలేమని పోలీసులు పేర్కొన్నట్లు ఆ లేఖలో ఉంది. అనుమతి లేకుండా రావడంతోనే అభిమానులు వచ్చారని.. దీంతో తొక్కిసలాట జరిగిందని ఆ రిపోర్టులో ఉంది. కోర్టులో ఇరుపక్షాల వాదనల సందర్భంగా తాము న్యాయమూర్తి ఎదుట ఈ నివేదికను ప్రవేశపెట్టినట్లు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ తెలిపారు.
ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సమయంలో థియేటర్‌కు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలోనే ఆయనతో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 2 రోజుల క్రితం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగా.. మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.