President Droupadi Murmu Hyderabad Tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శీతాకాల విడిది కోసం మంగళవారం హైదరాబాద్‌కు (Hyderabad) వచ్చారు. సాయంత్రం హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, సీఎస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ నెల 21 వరకూ ఆమె రాష్ట్రపతి కార్యాలయంలోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 18న రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


ట్రాఫిక్ ఆంక్షలు


రాష్ట్రపతి పర్యటన క్రమంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 20న సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలను ద్రౌపది ముర్ము సందర్శిస్తారు. అనంతరం ఆ కళాశాలకు రాష్ట్రపతి కలర్స్ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా వర్శిటీని సందర్శిస్తారు. అనంతరం కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు.


అంతకు ముందు ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు బయలుదేరి వెళ్లారు. ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. 'వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి.. వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి.' అని పేర్కొన్నారు.


Also Read: Hydra: హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !