Pending Challans Clearance : తెలంగాణ (Telangana)లో పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపు గడువు (Last Date ) నేటితో ముగియనుంది. ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు (Traffic Police )సూచించారు. దీనికి వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. డిసెంబరు 25 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% డిస్కౌంట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల రికార్డుల ప్రకారం 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఇందులో 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించారు. దాదాపు 70 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు చేయవచ్చు.
గతంలో 300 కోట్ల రూపాయలు వసూలు
గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించింది. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా అప్పుడు ఏకంగా రూ.300 కోట్ల రూపాయలు వరకు చలాన్లు వసూలు అయ్యాయి. ఈ సారి 3.50 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ ఉండటంతో మరోసారి రాయితీలు ప్రకటించింది. దీంతె మరోసారి ప్రభుత్వానికి చలాన్ల వసూలు ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నేటితో చలాన్లు చెల్లించలేకపోతే వందశాతం చలాన్లు చెల్లించాల్సి ఉంటుంది.
చలాన్ల వసూళ్ల కోసం వినూత్న ప్రచారం
పెండింగ్ చలాన్ల వసూలు కోసం పోలీసు యంత్రాంగం వినూత్నంగా ప్రచారం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిమానాలను రాబట్టేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తోంది. ప్రధానకూడళ్లు, జంక్షన్లలో పెండింగ్ చలానా చెల్లించాలంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. డిస్కౌంట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటూ సూచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
టెక్నాలజీ సాయంతో చలాన్లు విధింపు
హెల్మెట్ ధరించకపోవడం, నంబర్‌ప్లేట్ లేకుండా వాహనం నడపడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో పోలీసులు చలాన్లు వేస్తున్నారు. వీటికి తోడు రాంగ్ రూట్‌లో వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం వంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. వీరందరికీ రాయితీతో కూడిన బకాయిలు చెల్లించే అవకాశం లభించింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ చలాన్లను వాహనదారులు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. గత నెల 28న భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో పెద్ద మొత్తంలో వాహనదారులు చలాన్లను డిస్కౌంట్‌తో చెల్లింపులు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ బుధవారం ముగియనుండటంతో చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు.