Ranga Reddy dist News: శంషాబాద్: దిగ్గజ క్రికెటర్, వన్డే వరల్డ్ కప్ 1983 కెప్టెన్ కపిల్ దేవ్ తెలంగాణ పర్యటనకు వచ్చారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల్ పరిషత్ పాఠశాల భవనాన్ని కపిల్ దేవ్ (Kapil Dev) ప్రారంభించారు. మాజీ క్రికెటర్, ఖుషి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కపిల్ దేవ్, మై హోమ్ గ్రూప్, ప్రభుత్వం సంయుక్తంగా ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మించాయి. బాలబాలికల చదవులపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. చిన్నారులు చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని, వారి ద్వారా దేశం పలు రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నేను మీతో తెలుగులో మాట్లాడలేక పోతున్నందుకు బాధగా ఉందన్నారు కపిల్ దేవ్.


హాజరైన ప్రముఖులు వీరే.. 
మై హోం సంస్థ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు, ఖుషి ఫౌండేషన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నేటి సమాజంలో విద్యా, వైద్యం చాలా ముఖ్యమైనవని.. కొన్నిచోట్ల ఖరీదుతో కూడుకున్నవి అన్నారు. అయితే పేద విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు వెనుకంజలో ఉంటున్నాయని చెప్పారు. కనుక విద్యార్థులకు సరైన వసతులు కల్పిస్తే ప్రైవేట్ స్కూల్ లతో పోటీ పడతారని కపిల్ దేవ్ అన్నారు. మై హోం సంస్థ ముందుకు వచ్చి ఖుషి ఫౌండేషన్ తో కలిసి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చిందన్నారు. ప్రతి గదిలో మంచి బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్, అటలకోసం మైదానం, స్కూల్ చుట్టు మంచి మొక్కలు ఏర్పాటు చేశారు.


పేద విద్యార్దులకు అండగా ఉంటున్న మైహోం సంస్థతో పాటు ఖుషి ఫౌండేషన్ వారికి ఈ సందర్భంగా కపిల్ దేవ్ ధన్యవాదాలు తెలిపారు. చిన్నారుల ప్రదర్శన చూసి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల మధ్య తాను పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ స్కూల్ లో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర కీలక పదవులు కూడా చేపట్టాలని ఆకాంక్షించారు. 


ముచ్చింతల్ లో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి కపిల్ దేవ్ లాంటి క్రికెట్ దిగ్గజం రావడం గర్వించదగ్గ విషయమని మై హోం సంస్థ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు అన్నారు. పేద విద్యార్దుల కోసం అన్ని వసతులతో కలిగిన భవనాని నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన భవనాలను ప్రభుత్వం కూడా ఇవ్వాలని కోరారు. 


శంషాబాద్ శివారులోని వచ్చిన గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కపిల్ దేవ్, జూపల్లి జగపతిరావు ఆధ్వర్యంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఖుషి ఫౌండేషన్ ఎన్జీవో నెంబర్ పార్వతి రెడ్డి. తమ ఆర్గనైజేషన్‌లు మొత్తం ఏడు స్కూళ్లను తెలంగాణలో నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇండియాలో మొత్తం 85 స్కూళ్లను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం లక్షా యాభై మంది విద్యార్థులను చదివిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్కూళ్లను దత్తత తీసుకునేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ముచింతల్ గ్రామంలో నూతన స్కూల్ భవనం ప్రారంభానికి విచ్చేసిన గ్రామస్తులకు, హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపారు