GHMC restarts Prajavani in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఓ మహిళకు ఉద్యోగం లభించింది. విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉద్యోగం ఇచ్చారు. ప్రజావాణిలో భాగంగా బాధితురాలు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని తన దీనస్థితిని తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఆయన చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు ఉపాధి కల్పించారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్..
సొంగా శేఖర్ రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేశారు. విధులు నిర్వర్తిస్తుండగా 2021 సెప్టెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ సొంగా శేఖర్ చనిపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపి తనకు సహాయం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరగా ఫలితం లేకపోయింది. సొంగా శేఖర్  భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ కావడంతో.. స్థానికత కారణంగా ఆమెకు గత రెండేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది.  


ప్రజావాణి కార్యక్రమంలో రేవంత్ ను కలిసిన కానిస్టేబుల్ భార్య 
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజావాణి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ కానిస్టేబుల్ భార్య సత్యవతి తమ కుటుంబ దీనస్థితిని తెలపి, సాయం చేయాలని కోరింది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట డీజీపీ, రాచకొండ సీపీలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డి‌జి‌పి రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని రాచకొండ సీపీకి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ సీపీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. 


నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిందని.. నీతి, నిజాయితీతో పనిచేయాలని రాచకొండ సీపీ ఆమెకు సూచించారు. భవిష్యత్తులో కూడా సత్యవతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సత్యవతికి జాబ్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవడంపై కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, రాచకొండ సీపీకి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, దివంగత కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.