Congress 6 Guarantees Praja Palana Program: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన. ఆరు గ్యారంటీల (Congress 6 Guarantees )కు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. హైదరాబాద్ లో రోడ్ల మీద ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు (Praja Palana Applications on Road) రోడ్లపై కనిపించడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇద్దరు అభయహస్తం నోడల్ ఆఫీసర్లపై వేటు వేసింది. కుత్బుల్లాపూర్, హయత్ నగర్ అభయహస్తం నోడల్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. బాలానగర్, కుత్బుల్లాపూర్ లో ప్రైవేట్ వ్యక్తులకు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ పని అప్పగించడంపై సీరియస్ అయ్యారు.


అసలేం జరిగిందంటే.. 
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత నెల (డిసెంబర్‌) 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. కోటికి పైగా దరఖాస్తులు రాగా, అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ఈనెల (జనవరి) 17వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం అభయహస్తం దరఖాస్తులను ఆన్ లైన్ చేసేందుకు కొందరు అధికారులు ఈ పనిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. 


ప్రైవేట్‌ ఏజెన్సీకి అభయహస్తం దరఖాస్తులు 
ప్రజాపాలన దరఖాస్తులను కంప్యూటరీకరించే పనిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీకి కొందరు ప్రభుత్వ అధికారులు అప్పగించారు . దీంతో ధరఖాస్తులన్నీ ప్రైవేట్‌ ఏజెన్సీకి  తరలిస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ఓ యువకుడు AP39HH 6455 నెంబర్‌ గల స్కూటీపై అట్టపెట్టెలో వేలాది దరఖాస్తులను కుక్కి తీసుకెళ్తున్నాడు. నిన్న  (సోమవారం) సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో అట్టపెట్టె తాడు తెగిపోవడంతో... అందులోని అభయహస్తం దరఖాస్తులు రోడ్డుపై పడిపోయాయి. అందులో కొన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


బైక్‌ నడుపుతున్న  యువకుడి ముందు, వెనక వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా వాహనాలు ఆపి... ర్యాపిడో బైక్‌పై వెళ్తున్న యువకుడికి విషయం చెప్పారు. అప్పటికే ప్రజాపాలన దరఖాస్తులన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వాహనదారులు ఆ అప్టికేషన్లన్నీ ఏరి.. మళ్లీ అట్టపట్టెలో పెట్టారు. ఆ దరఖాస్తులను చూస్తే... అవన్నీ  హయత్‌నగర్‌కు చెందిన ప్రజాపాలన దరఖాస్తులుగా గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వివరాలు ప్రభుత్వం చేతిలో ఉండాలి, కానీ ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడం, వారు నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన చూశాక, ఇంతకీ తమ దరఖాస్తులను ప్రభుత్వం సరిగ్గా ఆన్ లైన్ లో ఎంట్రీ చేయిస్తుందా, తమకు పథకాలు వస్తాయా అని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.


ప్రజా పాలన వెబ్ సైట్ ప్రారంభం.. 
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది. ప్రజాపాలన పై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్  https://prajapalana.telangana.gov.in/ ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జనవరి 8న) డా.బీఆర్ అంబేద్కర్  ప్రారంభించారు. త్వరలోనే దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్ అప్రూవ్ అయిందో, రిజెక్ట్ అయిందో తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.