Telangana News: హైదరాబాద్‌లో రోజురోజుకు నీటి కొరత తీవ్రం అవుతోంది. ఇప్పుడు దాని ప్రభావం ఉస్మానియా యూనివర్శిటీపై పడింది. నీటి కొరత కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్స్ మూసివేస్తున్నట్టు వార్డెన్ ప్రకటన జారీ చేశారు. మే ఒకటో తేదీ నుంచి హాస్టల్స్, మెస్ మూసివేస్తున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 


ఉస్మానియా యూనివర్శిటీలో నీటి కొరత ఉందని ఆదివారం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. లేడీస్‌ హాస్టల్‌లో నీళ్లు విద్యుత్‌ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై అధికారులను నిలదీస్తు ధర్నాలు చేశారు. 


అమ్మాయిలకు సవా లక్ష సమస్యలు ఉంటాయని నీళ్లు సరఫరా చేయకుంటే ఎలా అంటూ విద్యార్థినులు నిలదీశారు. అధికారులు, ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆందోళన బాటపట్టారు. నీళ్లు లేవని చెబితే వెయ్యిమందికి అయ్యేలా ట్యాంకర్లు పంపించారని అవి ఎవరికీ సరిపోవడం లేదని వాపోయారు. 


విద్యార్థుల్లో నీటి కొరత ఆందోళనలు ఎక్కువ కావడంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించి హాస్టల్స్‌, మెస్‌ మూసి వేస్తున్నట్టు వార్డెన్ ప్రకటించారు. దీనిపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. పోటీ పరీక్షలు ఉన్న టైంలో ఉన్నఫళంగా వెళ్లిపోమంటే ఎక్కిడి వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. 


ఇటు విద్యార్థుల ఆందోళన, అటు వార్డెన్ ప్రకటన రెండూ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అటు ప్రతిపక్షాలు కూడా విద్యార్థులకు అండగా ఉంటున్నాయి. అసలే వేసవి కంటే ఎన్నికల కాలం కాబట్టి ఈ సమస్య మరింత తీవ్రం అయ్యేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.