KTR Latest News: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాతికేళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్న రాజకీయపార్టీలు రెండే రెండు అవి టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే అని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఇప్పుడు బీఆర్‌ఎస్ నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలు చాలా ప్రత్యేకమైనవిగా అభివర్ణించారు. అందుకే ఏడాదిపాటు నిర్విస్తున్నట్టు తెలిపారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Continues below advertisement


ఏప్రిల్ 27వ తేదీన వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. గతంలో ఉద్యమ సందర్భంగా వరంగల్‌లోనే చారిత్రాత్మక సభను నిర్వహించామని గుర్తు చేశారు. అదే రీతిలో ఈ సభను నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టినట్లు వివరించారు. ఈ సభకు అనుమతి కోసం మార్చి 28వ తేదీన పోలీసులకు దరఖాస్తు చేశామని, డీజీపీని వ్యక్తిగతంగా అనుమతి కోరినట్లు కేటీఆర్ చెప్పారు. 


ఈ సభా ప్రాంగణం, పార్కింగ్ కలుపుకుని 1200 ఎకరాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. సభ జరిగే ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం కావడం, విద్యార్థులకు సెలవులు ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. సభకు వచ్చే వారి కోసం 3 వేల బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీని కోరినట్లు చెప్పారు. వాళ్లు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని కేటీఆర్ వివరించారు. 


వరంగల్ సభను విజయవంతం చేయడం కోసం 33 జిల్లాల నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసినట్లు కేటీఆర్‌ చెప్పారు. సభ నిర్వహణ కోసం పార్టీ లో కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ సభ ముగిశాక ఏడాది పాటు ఈ వేడుకలు నిర్వహిస్తూనే కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. సభ్యత్వ నమోదు ఈదఫా డిజిటల్ పద్దతిలో చేపడతామన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ బైలాస్ ప్రకారం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత పార్టీ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకుని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఆ తర్వాత కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయన్నారు. 


ఏడాది పాటు ప్రతీ నెల ఒక్కో కార్యక్రమం నిర్వహించేలా 12నెలల పాటు పార్టీ కార్యక్రమాలు, ప్రజా పోరాటాలు ఉంటాయని కేటీఆర్ పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు. అయితే వరంగల్ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుంటామని, గతంలోను తమ సభలకు అనుమతులు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు.


ధరలు పెంచడమే బీజేపీ అచ్చేదిన్
సామాన్యుడి నడ్డి విరిగిలే ధరలు పెంచడమే బీజేపీ అచ్చేదిన్‌గా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. పెట్రో, గ్యాస్ ధరలపై ఆయన మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు తగ్గుతుంటే ఎన్డీఏ ప్రభుత్వ మాత్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతోందని ఆక్షేపించారు. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలని కాని మోదీ సర్కార్ ప్రజలపై భారం పెంచుతుందని విమర్శించారు. 


ట్రంప్ తెచ్చిన నూతన టారిఫ్ విధానంపై మోదీ సర్కార్ పెదవి విప్పడం లేదని, దీని వల్ల తెలంగాణకు చాలా నష్టం చేకూరుతుందన్నారు కేటీఆర్. తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతులు అయ్యే ఫార్మా, ఐటీ ఎగుమతులపై అమెరికా విధించనున్న పన్నులు తెలంగాణకు తీవ్ర నష్ట దాయకమని కేటీఆర్ అన్నారు.


జాతీయ పార్టీల వల్ల రిమోట్ కంట్రోల్ పాలన
తెలంగాణను రెండు జాతీయ పార్టీలు రిమోట్ కంట్రోల్ పాలన సాగిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బతుకు ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉందన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా మంత్రివర్గ విస్తరణ చేసుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదని విమర్శించారు. డబులు ఇంజన్ అనే బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి ఒక్క రూపాయి అదనంగా తేలేకపోయారని కేటీఆర్ మండిపడ్డారు.