హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సీవీ ఆనంద్ చేసిన చిన్న పని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ముదిరేలా చేసింది. ఆయన చేసిన చిన్న ఎమోజీ పోస్టుపై దాదాపు నెలన్నర తరువాత ఎట్టకేలకు స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు సారీ చెప్పారు. ఇక్కడితో ఈవివాదానికి స్వస్తి పలకాలని సూచించారు. దాంతో బాలయ్య అభిమానులు శాంతించారు.
సీవీ ఆనంద్ తాజా పోస్టులో ఏముంది..దాదాపు రెండు నెలల కిందట నేను ఒక ఎమోజీ పోస్ట్ పెట్టాను. ఆ ఎమోజి మీద బాలకృష్ణ అభిమానులు, ఆయన విమర్శకులు ఒకరితో ఒకరు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చేశారు. చివరికి ఆ గొడవలో భాగంగా నన్ను టార్గెట్ చేసుకున్నారని గమనించాను. నగరంలోని వివిధ సంఘటనలు, కేసులు, ఇతర సమస్యలను ఎక్స్, instaలో పోస్ట్ చేయడానికి నా సోషల్ మీడియాను నిర్వహించే వాడిని. సమయం లేకపోవడం వల్ల ఎమోజీ పోస్టుపై జరిగిన ఫ్యాన్ వారు, నామీద కామెంట్లపై సకాలంలో స్పందించలేకపోయాను.
సెప్టెంబర్ 29న జరిగిన ప్రెస్ మీట్ తర్వాత, బాలయ్యకు సంబంధించిన విషయం ఓ నెటిజన్ అడిగిన పోస్టుకు బదులుగా ఎమోజీని పోస్ట్ చేశాను. వాస్తవానికి అది పూర్తిగా అనవసరం. అలా చేసి ఉండకూడదు. ఇప్పటివరకు నాకు దాని గురించి ఐడియా లేదు. ఈ వివాదం గురించి తెలుసుకున్న తర్వాత, నేను ఆ పోస్ట్‌ను తొలగించి వివరాలు తెలుసుకుని బాలయ్య గారికి మెసేజ్ చేసాను. నాకు బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుసు. నా పోస్ట్ ఆయనను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కూడా చెబుతున్నాను. నేను బాలయ్యతో పాటు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూస్తూ, వారి నటనను ఆస్వాదిస్తూ పెరిగాను. వారందరితో నాకు స్నేహం ఉంది. వారంటే నాకు చాలా గౌరవం ఉంది.
నేను చేసిన ఎమోజీ పోస్టుతో పాటు మరో రెండు లేదా మూడు తప్పుడు పోస్ట్‌లు / రిప్లైలు గత నెలలోనే ఆ హ్యాండ్లర్‌ను తొలగించాను. అందుకే ఇప్పుడు నా పోస్ట్‌లను మీరు తక్కువగా ఉన్నట్లు గమనించి ఉంటారు. సమయం సరిపోకపోవడంతో చాలా తక్కువ రిప్లై పోస్టులు కనిపిస్తున్నాయి. దయచేసి ఈ వివాదాన్ని ఇప్పుడే ముగించమని నేను ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు’ అని ఐపీఎస్ సీవీ ఆనంద్ తాజాగా చేసిన పోస్ట్ వివాదానికి చెక్ పెట్టింది.
ఇంతకీ వివాదం ఏంటి..దాదాపు నెలన్నర కిందట సినీ ప్రముఖులతో పోలీసులు సమావేశం అయ్యారు. ఆ మీటింగ్ గురించి అప్పటి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇలా రాసుకొచ్చారు. ‘తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మూవీ కంపెనీలను మూవీ పైరసీ ముఠా అనుమానాలపై ఒక ప్రెజెంటేషన్‌కు ఆహ్వానించి, వారికి వివరాలు తెలియజేశాం. థియేటర్లలో విడుదలకు ముందే వారి సినిమాల HD వెర్షన్లు ఎలా లీక్ అవుతున్నాయో తెలుసుకుని సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. హ్యాకర్లు, పైరసీదారులకు డబ్బులు చెల్లిస్తున్నది బెట్టింగ్ యాప్ నిర్వాహకులే అని వారు గ్రహించడంతో భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించబోమని సినీ ప్రముఖులు చెప్పారు.
డిజిటల్ మీడియా కంపెనీలు తమ సైబర్ భద్రత సరిపోదో గ్రహించి, తమ సర్వర్‌లను కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తాయి. చిరంజీవితో పాటు, వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య, దిల్ రాజు, పలువురు హీరోలు, నిర్మాతలు హైదరాబాద్ నగర పోలీసు సైబర్ క్రైమ్ బృందంతో జరిగిన ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమను రక్షించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాన్ని వారు చాలా అభినందించారని’ సీవీ ఆనంద్ పోస్ట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన ఓ బాలయ్య అభిమాని మా బాలకృష్ణకు మీటింగుకు ఎందుకు పిలవలేదని, ఈ విషయాన్ని బాలయ్య అసెంబ్లీలో లేవనెత్తుతారని కామెంట్ చేశాడు. దానికి స్పందించిన సీవీ ఆనంద్ నవ్వుతున్నట్లు ఉండే ఓ ఎమోజీని పోస్ట్ చేయడం వావాదానికి దారి తీసింది. ఇతర నటుల అభిమానులు, విమర్శకులు సీవీ ఆనంద్ కు మద్దతు తెలపగా.. బాలయ్య ఫ్యాన్స్ సీవీ ఆనంద్ చర్యను తప్పు పట్టారు. సినీ ఫ్యాన్ వార్ స్థాయి పెరిగిందా.. లేక ఐపీఎస్ స్థాయి తగ్గిందా అని పోస్ట్ చేయడంతో సీవీ ఆనంద్ స్పందించారు. బాలయ్యకు క్షమాపణ చెప్పానని, వివాదానికి స్వస్తి చెప్పాలని కోరారు.