Telangana CM Revanth Reddy | హైదరాబాద్: రామోజీరావు తరహాలో సంస్థలను నిర్వహించడం అంత ఆషామాషీ కాదని, రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఒక గొప్ప ఆస్తి (ఎస్సెట్) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌లో నాలుగు అద్భుతాలు ఉన్నాయని అనుకుంటే, అందులో ఒకటి చార్మినార్, రెండోది గోల్కొండ, మూడోది హైటెక్ సిటీ కాగా, నాలుగో వండర్‌గా రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామోజీ రావు అందించిన విలువలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్న రామోజీ గ్రూప్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 

Continues below advertisement

"స్క్రిప్ట్‌తో వచ్చి, ప్రింట్ తీసుకుని వెళ్లండి" అని రామోజీ రావు ఫిల్మ్ సిటీని ప్రారంభించినప్పుడు చెప్పేవారని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు ఫిల్మ్ సిటీని ఆ స్థాయిలో తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉదయం నిద్రలేవగానే రామోజీ పేపర్ చదవడం, నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలు చూడడం అందరికీ అలవాటుగా మారిపోయిందన్నారు. వాస్తవాలను అందించాలన్న తపన వారిలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పచ్చళ్లు తినిపించినా, పత్రిక చదివించినా... అది రామోజీ రావుకే సాధ్యమైందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతీ రంగంలో రామోజీ రావు తన ముద్ర వేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు పొందిన వారికి ఆయన అభినందనలు తెలిపారు.

Continues below advertisement

మనందరం రామోజీ రావు ఆలోచనలను భవిష్యత్ తరాలకి అందించే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రామోజీ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని, ఆ బ్రాండ్‌ను అలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి

రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ సరదాగా చర్చించుకుంటూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిత్యం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండే తెలుగు రాష్ట్రాల సీఎంలు రామోజీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని సరదాగా గడిపారు.