హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రలింకులు కలకలం రేపాయి. ఏటీఎస్ పోలీసులు పాతబస్తీలో పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా ఓ తండ్రీకుమార్తెను ఎంక్వయిరీ చేస్తున్నారని తెలుస్తోంది.
రామగుండంలో అరెస్టు
గుజరాత్‌కు చెందిన ఏటీఎస్ బృందాలు ఈ మధ్య కాలంలో ఐఎస్‌కేపీకి సహకరిస్తున్నారనే కారణంతో కొంతమందిని అరెస్టు చేశారు. అలా అరెస్టు చేసిన వారిలో సుమేరా భాను ఒకరు. ఆమెతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో హైదరాబాద్ పాతబస్తీలో కూడా కొందర్ని ప్రశ్నిస్తున్నారు ఏటీఎస్ పోలీసులు. హైదరాబాద్‌తోపాటు పెద్దపల్లి జిల్లా రామగుండంలో కూడా ఎంక్వయిరీ చేశారు.
హైదరాబాద్‌లో విచారణ
రామగుండంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మహ్మద్ జావిద్, అతని కుమార్తె ఖదీజాను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. ఓ శుభకార్యం కోసం వారు అక్కడి వెళ్లినట్టు తేల్చారు. అందుకే వారిని అదుపులోకి తీసుకున్న వెంటనే హైదరాబాద్‌కు తీసుకు వచ్చి విచారించారు.
సుమేరా సహా నలుగురు అరెస్టు
నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్‌కేపీపై ఫోకస్ చేసిన గుజరాత్ ఏటీఎస్ పోలీసులు... సుమేరా బాను సహా నలుగురిని అరెస్టు చేశారు. వీళ్లు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రలింకులను బయటకు తీస్తున్నారు.
ఆన్‌లైన్‌లో రిక్రూట్‌మెంట్
ఏటీఎస్‌కు చిక్కిన సుమేరా బాను ఆన్‌లైన్ ద్వారా ఐఎస్‌కేపీపై ప్రభావితమైంది. సోషల్ మీడియా ద్వారా అందులో శిక్షణ తీసుకుంది. అంతే కాకుండా తెలిసినవారందర్నీ చేర్పించి దేశవ్యాప్తంగా భారీ విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ రావడానికి కూడా బాను ప్రయత్నించింది. ఇక్కడ ఓ వ్యాపారితో తరచూ టచ్‌లో ఉంటూ తనకు ఉద్యోగం చూడాలని కూడా రిక్వస్ట్ పెట్టింది. అదే టైంలో ఓ తండ్రీ కుమార్తెతో కూడా టచ్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఆ ముఠా పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది.
సూరత్‌లో మీటింగ్
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఐఎస్‌కేపీ సానుభూతి పరులను తయారు చేసింది బాను. అలా వారిందరితో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూనే ఉగ్రవాదాన్ని నూరుపోసింది. వీళ్లతో భారీ విధ్వంసం సృష్టించాలని భావించి ఓ మీటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. సూరత్‌లో అందరూ మీట్ అయ్యేలా చేసింది. అయితే దీనికి కీలకమైన వ్యక్తులను మాత్రమే పిలిచింది. ఇలా ఐఎస్‌కేపీ సానుభూతి పరులు మీటింగ్ పెట్టుకుంటున్నారనే విషయాన్ని గ్రహించిన పోలీసులు కౌంటర్ అటాక్ చేశారు. బానుసహా నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై స్పీడ్ లిమిట్ పెంపు, ఇక మరింత వేగంతో రయ్ రయ్!
Also Read: రెండో రోజు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు - రూ.1,278 కోట్లు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం !