సిరివెన్నెలను చూసేందుకు కడసారి చూసేందుకు వస్తున్న సినీ ప్రముఖులు



సిరివెన్నెల‌ సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి సిరివెన్నెలకు నివాళి అర్పించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి వ‌ట‌వృక్షం కూలిపోయిందంటూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. వెంక‌టేష్, అల్లు అర్జున్, నాని, బాలకృష్ణ, నందిని రెడ్డి, అశ్వనీదత్, ఎస్వీ క్రిష్ణారెడ్డి, సింగర్ సునీత తదితరులు సిరివెన్నెలకి నివాళులు అర్పించారు. నేడు ఫిల్మ్ నగర్‏లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు.



సీతారామశాస్త్రికి మంత్రి పేర్ని నాని నివాళులు



సిరివెన్నెల భౌతిక కాయానికి ఏపీ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని నివాళి అర్పించారు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తెలుగు అక్షరాలతో పద విన్యాసం చేసి ప్రతి వ్యక్తి మదిలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఆయన. సీతారామశాస్త్రికి ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌కు ఘన నివాళి అర్పి్స్తున్నాం. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని పేర్ని నాని అన్నారు. 


సిరివెన్నెలకు నాగార్జున, జీవితా రాజశేఖర్ దంపతులు నివాళులు



సిరివెన్నెల సీతారామశాస్త్రికి నాగార్జున, జీవితా రాజశేఖర్ దంపతులు నివాళులు అర్పించారు. తమ సినిమాలకు ఎన్నో మంచి పాటలు రాశారని.. చాలా చిన్న వయసులో ఆయన తనువు చాలించారని చెప్పారు. ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెబుతూ ప్రముఖులు సిరివెన్నెలకు నివాళులర్పిస్తున్నారు. 


సిరివెన్నెల సీతారామశాస్త్రికి మంత్రి తలసాని నివాళి



ఫిలిం ఛాంబర్‌కు వెళ్లిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. 11 నంది అవార్డులు సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి అని, పద్మశ్రీ సొంతం ఆయనకు దక్కిందని తలసాని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల వారికి సిరివెన్నెల మరణం విషాదాన్ని నింపిందన్నారు. పాటల రచయిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల పాటలకు చాలా అర్థం ఉంటుందని, ఎన్నో పాటలను మనకు అందించారని చెప్పారు. వారి కుటుంబంతో పాటు తెలుగు వారికి ఆయన మరణం చాలా లోటు అన్నారు.



సిరివెన్నెలకు అగ్ర నటులు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నివాళి..



ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి టాలీవుడ్ అగ్రనటులు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. రాబోయే తరాలకు సిరివెన్నెల సాహిత్యం బంగారు బాటగా మారుతుందని ఎన్టీఆర్ అన్నారు. సిరివెన్నెల భౌతికకాయం వద్ద పవన్ కళ్యాణ్ కొద్దిసేపు అలాగే ఉండిపోయారు.






Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి