Telangana Rains Latest News | హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. అల్పపీడన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల రోజుల పాటు (ఇవాళ, రేపు, ఎల్లుండి) పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం తెలిపారు.
ఈ జిల్లాల్లో రెండు, మూడు రోజులు వర్షాలుఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలగనుంది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు, రాష్ట్రంలో ఒకే సమయంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తనున్నాయి. మంగళవారం (మే 19) నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగనుందని, వారం రోజులపాటు అదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు వర్షాలుఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఆయా ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ వర్తిస్తుందని పేర్కొన్నారు. వీటికి తోడు రేపు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు (Heatwaves) వీచే అవకాశముందని, ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
కేరళ నైరుతి రుతుపవనాల రాకపై అప్‌డేట్కేరళ ప్రాంతంలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అవసరమైన తీరుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. కేరళంలో రుతుపవనాల రాకకు నిర్దేశించిన ఈ ప్రమాణాలు మే 29 తర్వాత మాత్రమే పూర్తి కానున్నాయి. తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు మే 30కి రెండు రోజుల ముందు లేదా తరువాత ప్రవేశించే అవకాశం ఉంది.
