Heatwave In Telangana | హైదరాబాద్: ఈ నెల 19 నుండి 24వ తేదీల మధ్య పగటి వేళల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని , తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ముఖ్యంగా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగితే డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లాలని, లేకపోతే తలకు క్యాప్ ధరించాలని సూచించారు. మొన్నటివరకూ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల వరకు ఉండగా.. వచ్చే వారం రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు , అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రేకుల ఇళ్లలో ఉండేవారు వేడిని తగ్గించుకోవడానికి ఇంటి రేకులపై ఎండుగడ్డి లేదా తడిపిన జనపనార సంచులు వేస్తే కాస్త ఉపశమనం ఉంటుంది.
ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు
ఏపీలో మే 18న 28 మండలాల్లో వడగాలులు వీచనున్నాయి. మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచనున్నాయి. సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, బూర్జ, నందిగం, పాతపట్నం, హిరమండలం, కంచిలి, సోంపేటలో.. విజయనగరం జిల్లాలో దత్తిరాజేరు, గంట్యాడ, బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగరలో, మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస, కొమరాడ, బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో వడగాలులు వీచనున్నాయి. ద్రోణి ప్రభావంతో మే 18న మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ కేంద్రం అంచనా వేసింది.
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి?సాధారణంగా వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. వచ్చే వారం ఎండ వేడికి చెమట రూపంలో శరీరం నుంచి ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా పోతుంటాయి. దాంతో తీవ్రమైన అలసట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి బొండం, మజ్జిగ, ఓఆర్‌ఎస్ (ORS), నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు, చక్కెర కలుపుకుని తాగినా ప్రయోజనం ఉంటుంది.
బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తఎండలో ప్రయాణించాల్సి వస్తే, బయటకు వెళ్లాల్సి వస్తే వెంట గొడుగు తీసుకెళ్లాలి. లేకపోతే తలకు టోపీ లేదా తెల్లటి బట్ట కట్టుకోవడం మంచిది. ముక్కు, చెవుల ద్వారా వేడి గాలి లోపలికి వెళ్లకుండా కర్చీఫ్ కట్టుకోవాలి. శరీరానికి గాలి ఆడేలా ఉండే వదులైన కాటన్ దుస్తులు ధరించడం ఎంతో మంచిది.
హైపర్‌టెన్షన్ బాధితులుబ్లడ్ ప్రెజర్ కంట్రోల్ కోసం కొన్ని రకాల మందులు వాడేవారిలో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రం ద్వారా సోడియం, పొటాషియం బయటకు పోతాయి. ఇలాంటి వారు సాధారణం కంటే ఎక్కువ నీరు, పండ్ల రసాలు, ఇతర ద్రావణాలు తీసుకోవాలి.
గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు జాగ్రత్తలుగర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ వారం రోజుల పాటు ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిది.
ఒకవేళ వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?మే 19 నుంచి వారం రోజులపాటు వడగాలులు, మరోవైపు భానుడి ప్రతాపానికి ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. రోడ్డుపై కానీ, ఇంట్లో కానీ ఎవరైనా వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనైతే.. వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీరాన్ని పూర్తిగా తడి గుడ్డతో తుడవాలి. వారికి గాలి బాగా ఆడేలా చూడాలి. ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగించి, అవసరమైతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఎవరికైనా వాంతులు, విరేచనాలు అవుతుంటే డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. తరువాత వైద్యుల సూచనలు పాటించి వారికి ఆహారం ఇవ్వాలి.
