Weather News Rain Updates: తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాత్తి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.
వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లోని ఆవర్తనం ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ... ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగిందని పేర్కొంది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మదలు అయింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట, ప్రగతి నగర్, మూసాపేట, బాచుపల్లి, కేపీహెచ్ బీ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కోంపల్లి, సూరారం, షావూర్ నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, మల్కాజీగిరి, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తింది. ఒక్కసారి భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 83 శాతంగా నమోదైంది.
ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ జిల్లాలతో పాటు యానాంలలో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial